|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారు ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు మరియు గంజాయి వినియోగం రోజురోజుకు పెరుగుతున్నట్లు స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పరిసరాల్లో కొందరు వ్యక్తులు బహిరంగంగా గంజాయి సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, ఈ అక్రమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించే వారిపైనే దాడులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు..
స్థానికుల సమాచారం ప్రకారం, గంజాయి విక్రయాలు మరియు వినియోగంపై పలుమార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన తగిన చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఇటీవల గంజాయి సేవిస్తున్న వారిని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎడపల్లి పోలీస్ స్టేషన్లో పలువురిపై ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించలేదని బాధితుడు పేర్కొన్నాడు..
ఓ వైపు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీసు శాఖ, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. రోజురోజుకీ గంజాయి విక్రయాలు, వినియోగం పెరగడం వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ శాంతిభద్రతల పరిరక్షణ కోసం గంజాయి విక్రయాలు, మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాగే పోలీసు శాఖ నిర్లక్ష్య వైఖరి కొనసాగితే ప్రజా ఆందోళనలు పెరిగే అవకాశం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.








