|| దృశ్యం న్యూస్ ||
బోధన్: తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి కల్లు దుకాణం ముందు లైసెన్సుదారుడి వివరాలు, ధరల పట్టిక, ప్రజా ఆరోగ్య హెచ్చరికలు, మైనర్లకు విక్రయం నిషేధం వంటి కీలక సమాచారాన్ని స్పష్టంగా కనిపించే విధంగా బోర్డులు లేదా ప్లెక్సీల రూపంలో ప్రదర్శించడం తప్పనిసరి. అయితే బోధన్ నియోజకవర్గ పరిధిలోని అనేక కల్లు దుకాణాల వద్ద ఈ నిబంధనలు అమలు కావడం లేదని సామాజిక వేత్తలు ఆరోపిస్తున్నారు.
ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాల ప్రకారం దుకాణాల ముందు లైసెన్స్ నంబర్, లైసెన్సుదారుడి పేరు, కల్లు ధరల పట్టిక, “18 సంవత్సరాల లోపు వారికి కల్లు విక్రయించబడదు”, “ప్రజా ఆరోగ్య హెచ్చరిక”, “కల్తీ కల్లు విక్రయం, నిల్వ మరియు రవాణా శిక్షార్హమైన నేరం” వంటి హెచ్చరికలు తప్పనిసరిగా ప్రదర్శించాలి. అదేవిధంగా ఫిర్యాదుల కోసం సంబంధిత ఎక్సైజ్ అధికారుల సంప్రదింపు ఫోన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది.. కానీ బోధన్ నియోజకవర్గంలోని చాలా కల్లు దుకాణాల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు, గమనిక బోర్డులు, ధరల పట్టిక, లైసెన్స్ వివరాలు కనిపించడం లేదు.. ఇది వినియోగదారుల హక్కులకు భంగం కలిగించడమే కాకుండా ప్రభుత్వ నిబంధనల ఉల్లంఘనగా భావించవచ్చు..
తెలంగాణ ఎక్సైజ్ శాఖ జారీ చేసిన లైసెన్స్ షరతుల ప్రకారం అవసరమైన సమాచారాన్ని ప్రదర్శించని దుకాణాలపై షోకాజ్ నోటీసులు జారీ చేయడం, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ ఈ అంశంపై బోధన్ ఎక్సైజ్ శాఖ అధికారులు తగిన పర్యవేక్షణ, తగిన చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి బోధన్ నియోజకవర్గంలోని ప్రతి కల్లు దుకాణం ముందు తప్పనిసరి నోటీసులు, హెచ్చరిక బోర్డులు మరియు ధరల పట్టికలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని సామాజిక సంస్కర్తలు డిమాండ్ చేస్తున్నారు.








