మెదక్‌: POCSO కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష.. రూ.1 లక్ష జరిమానా విధించిన కోర్టు.

|| దృశ్యం న్యూస్ ||

మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. తూప్రాన్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన POCSO కేసులో నిందితుడిని కోర్టు దోషిగా తేల్చి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1 లక్ష జరిమానా విధించినట్లు వెల్లడించారు.

తూప్రాన్ పీఎస్ పరిధిలోని జండపల్లి గ్రామానికి చెందిన సోమగారి భాస్కర్ (27) బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదు అందడంతో అప్పటి ఎస్ఐ సురేష్ కుమార్ కేసు నమోదు చేశారు. అనంతరం అప్పటి దర్యాప్తు అధికారి సీఐ శ్రీధర్ సమగ్రంగా విచారణ జరిపి కీలక సాక్ష్యాధారాలు సేకరించి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
ఈ కేసును విచారించిన మెదక్ ఫాస్ట్ ట్రాక్ POCSO కోర్టు న్యాయమూర్తి ఆర్.ఎం. సుభావల్లి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. అలాగే రూ.1 లక్ష జరిమానా మొత్తాన్ని బాధితురాలికి పరిహారంగా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కేసు విజయవంతంగా నడిపించడంలో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. బాలయ్య, భరోసా లీగల్ ఆఫీసర్ అడ్వకేట్ కే. స్వేత కీలక పాత్ర పోషించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment