అనుమతులు లేని అక్రమ పరిశ్రమ – అధికారుల అవినీతి, నిర్లక్ష్యానికి బహిరంగ సాక్ష్యం.

|| దృశ్యం న్యూస్ ||

ప్రభుత్వశాఖల అనుమతులు లేకుండానే అక్రమ పరిశ్రమ నిర్విరామంగా కొనసాగుతున్న వ్యవహారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో అధికారుల అవినీతి, నిర్లక్ష్య ధోరణికి స్పష్టమైన అద్దం పడుతోంది. గ్రామ ప్రధాన రహదారి పక్కనే, ప్రజా నివాస ప్రాంతానికి అతి సమీపంలో ఎలాంటి చట్టబద్ధమైన అనుమతులు లేకుండా భారీ స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ పరిశ్రమ కొనసాగుతుండడం స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ అక్రమ కేంద్రానికి రోజూ వందల క్వింటాళ్ల మేర ప్లాస్టిక్ వ్యర్థ సామగ్రి వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి అవుతోంది. వాటిని ఈ పరిశ్రమ కేంద్రంలో చిన్న చిన్న తునకలుగా మార్చి ఆటోమొబైల్, టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్స్ తదితర పరిశ్రమలకు రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద స్థాయిలో అక్రమ దిగుమతి–ఎగుమతులు జరుగుతున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
పరిశ్రమ శాఖ, గ్రామపంచాయతీ, కాలుష్య నియంత్రణ మండలి, ఫైర్ సేఫ్టీ, తదితర సంబంధిత ఏ శాఖ నుంచి కూడా అనుమతులు పొందకుండా ఈ పరిశ్రమ గత సంవత్సరం కాలంగా నిర్బంధం లేకుండా కొనసాగుతుండటం గమనార్హం.

అలాగే ఈ ప్రాంతం ఇండస్ట్రీయల్ జోన్ పరిధిలోకి రాకపోవడం, చుట్టుపక్కల నివాస గృహాలు ఉండటం వల్ల ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోంది.
రోడ్డు పక్కనే భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలను అక్రమంగా నిల్వ చేయడం వల్ల దుర్వాసన, వాయు కాలుష్యం పెరిగి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో వ్యర్థాలు రహదారిపైకి చేరి ప్రమాదాలకు దారితీసే పరిస్థితి నెలకొంది. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడం వెనుక అవినీతి పాల్పడి ఉంటారని ఆరోపణలు స్థానికుల నుంచి వెల్లువెత్తుతున్నాయి.

చట్టాలు, నిబంధనలు కేవలం కాగితాలకు మాత్రమేనా? అక్రమ పరిశ్రమల విషయంలో అధికారులు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? అధికారుల బాధ్యత ఎక్కడ? అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం స్పందించి అక్రమ పరిశ్రమపై తక్షణమే కఠిన చర్యలు తీసుకొని, ఈ కేంద్రాన్ని ఈ ప్రాంతం నుంచి వెంటనే తొలగించాలని జానకంపేట్ గ్రామస్తులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment