కొనుగోలు కేంద్రాల వద్ద కూడా రైతులకు కష్టాలు తప్పవా? 15 రోజుల నిరీక్షణ.

|| దృశ్యం న్యూస్ ||

వరి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తీవ్రమైన ఎండలు, నిరీక్షణ కారణంగా అనారోగ్య సమస్యలు తలెత్తి రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో రైతులు వరి కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండనక వాననక కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన తర్వాత కూడా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో రైతులు 10 నుండి 15 రోజుల పాటు తమ ధాన్యాన్ని కుప్పలుగా వేసి రాత్రింబవళ్లు కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది… తీవ్రమైన ఎండలు, వేడి గాలులు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు.

ఇదివరకే వరి కొనుగోలు ఆలస్యంపై వార్తలు వెలువడినప్పటికీ సంబంధిత అధికారుల్లో ఎలాంటి చలనం కనిపించడం లేదు… అంతేకాకుండా రైతుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. కొనుగోలు కేంద్రం వద్ద రైతులే స్వయంగా ధాన్యాన్ని సంచుల్లో నింపుతూ తూకం వేసే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇది కొనుగోలు వ్యవస్థలో ఉన్న లోపాలను స్పష్టంగా చూపిస్తోంది. అధికారులు కొనుగోలు ఆలస్యానికి పలు కారణాలు చెబుతున్నప్పటికీ, కొనుగోలు వేగవంతం చేయడానికి చర్యలు మాత్రం కనిపించడం లేదు.

ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రైతులకు అధికారులపై ఆగ్రహం మరింత పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment