|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్: మోస్రా గ్రామానికి చెందిన పిట్ల మోహన్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. తన కుమార్తె కర్రోళ్ళ లక్షిత అలియాస్ కవిత (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. సంవత్సరం క్రితం ధర్పల్లి మండలం గోవింద్‌పల్లి గ్రామానికి చెందిన నెహ్రూతో లక్షిత వివాహం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఫిర్యాదుదారుడు పిట్ల మోహన్ తెలిపిన వివరాల ప్రకారం, వివాహం జరిగిన రెండు నెలల తరువాత నుంచే భర్త నెహ్రూ, అతని తండ్రి పెద్ద రాజులు, తల్లి సత్తెవ్వ కలిసి అదనపు కట్నంగా రూ.2 లక్షలు తీసుకురావాలని లక్షితను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురిచేసినట్లు ఆరోపించారు. ఈ వ్యవహారంపై పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినప్పటికీ, అత్తింటి వారి ప్రవర్తనలో మార్పు రాలేదని పేర్కొన్నారు.
సోమవారం సాయంత్రం మరోసారి అదనపు కట్నం కోసం వేధింపులు తీవ్రరూపం దాల్చినట్లు సమాచారం. ఈ వేధింపులను తట్టుకోలేక లక్షిత అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుమార్తె మరణంపై అనుమానం ఉందని పిట్ల మోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.








