అక్రమ వెంచర్ల దందాపై కఠిన హెచ్చరికలు: అధికారిక బోర్డులను ధ్వంసం చేసిన దుండగులు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో అక్రమ వెంచర్ల వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. సంబంధిత శాఖల అనుమతులు లేకుండా వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్ల అమ్మకాలు చేపడుతున్న నిర్వాహకులపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం వార్త కథనాల ద్వారా అధికారుల దృష్టికి వెళ్లడంతో పంచాయతీ అధికారులు గత శుక్రవారం చర్యలు చేపట్టారు.

గ్రామ పంచాయతీ మరియు DTCP-NUDA అనుమతులు లేని ఈ వెంచర్లలో గృహ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వబడవని, అలాగే ఎవరూ క్రయ విక్రయాలు చేయరాదని హెచ్చరిస్తూ అధికారులు నాలుగు ప్రాంతాల్లో అధికారిక హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయితే ఈ హెచ్చరికలను కూడా లెక్క చేయకుండా మూడు ప్రాంతాలలో వెంచర్ నిర్వాహకులు బోర్డులను తొలగించి ధ్వంసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి సందీప్ మరియు పాలకవర్గ సభ్యులు తీవ్రంగా స్పందించారు. హెచ్చరిక బోర్డులు ధ్వంసం చేసిన వారిపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చట్టాన్ని లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న అక్రమ వెంచర్ల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇక గ్రామస్తులు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు, అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేయడమే కాకుండా అధికారిక హెచ్చరికలను ధ్వంసం చేయడం బాధ్యతారాహిత్యమని వారు అంటున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై పోలీసులు కఠిన శిక్షలు విధించి భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలను అరికట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment