బోధన్‌లో నూతన గృహాల్లో విద్యుత్ వైర్ల వరుస దొంగతనాలు – పోలీసుల నిఘాపై ప్రశ్నలు

|| దృశ్యం న్యూస్ ||

బోధన్ పట్టణంతో పాటు పరిసర గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల నూతనంగా నిర్మాణంలో ఉన్న గృహాలను లక్ష్యంగా చేసుకుని విద్యుత్ వైర్ల దొంగతనాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. నిర్మాణ దశలో ఉన్న ఇళ్లలో అమర్చిన ఖరీదైన ఎలక్ట్రికల్ వైర్లను రాత్రివేళల్లో దుండగులు చాకచక్యంగా ఎత్తుకెళ్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంఘటనల కారణంగా ఒక్కో ఇంటికి దాదాపు ₹1 లక్ష వరకు ఆర్థిక నష్టం వాటిల్లుతున్నట్టు సమాచారం.
స్థానికుల వివరాల ప్రకారం, పట్టణంలో మరియు గ్రామాల్లో పోలీసుల పర్యవేక్షణ సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. కొత్తగా ఇళ్లు నిర్మిస్తున్న యజమానులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఖాళీగా ఉన్న గృహాలను లక్ష్యంగా చేసుకుని దొంగలు ముందస్తు ప్రణాళికతో దాడులు నిర్వహిస్తున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రజలు పోలీసు శాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రాత్రి పహారా బలోపేతం చేయడం ద్వారా ఇలాంటి దొంగతనాలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు.
పోలీసులు త్వరితగతిన స్పందించి నిందితులను పట్టుకుని కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో ఈ దొంగతనాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment