భారీ సైబర్ మోసం బట్టబయలు.. ₹152 కోట్ల లావాదేవీలు వెలుగులోకి.. 9 మంది అరెస్ట్.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పర్యవేక్షణలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో భారీ సైబర్ మోసగాళ్ల నెట్‌వర్క్‌ను ఛేదించారు. IV టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సతీష్ నేతృత్వంలో, సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో జరిగిన ఈ దాడుల్లో మొత్తం 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. గతంలో ఇదే కేసులో ఇప్పటికే 7 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు నకిలీ ధృవపత్రాలు, తప్పుడు వ్యాపార పత్రాలు ఉపయోగించి కర్ణాటక బ్యాంక్‌లో కరెంట్ అకౌంట్లు తెరిచినట్లు గుర్తించారు. ఆ అకౌంట్లను మధ్యవర్తుల ద్వారా సైబర్ మోసగాళ్లకు విక్రయించి, ఆర్థిక నేరాలకు వినియోగిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఈ అక్రమ ఖాతాల ద్వారా కేవలం మూడు నెలల వ్యవధిలోనే సుమారు రూ.152 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది.

ఈ కేసులో ఇంకా మరికొంతమంది ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిని గుర్తించేందుకు లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. ఖాతాలు తెరవడంలో కస్టమర్లు సమర్పించిన పత్రాలను సరైన రీతిలో ధృవీకరించకుండా నిర్లక్ష్యం ప్రదర్శించిన బ్యాంకు అధికారులపైనా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశముందని పోలీసులు హెచ్చరించారు. సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రజల అప్రమత్తత అత్యంత కీలకమని అధికారులు సూచించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment