|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం రేకులపల్లి గ్రామానికి చెందిన కాత్రాజి రాజశేఖర్ (30) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, రాజశేఖర్ గత నెల 31 మంగళవారం నుండి కనిపించకపోవడంతో ధర్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గల్లంతైన యువకుడి కోసం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్న వేళ, ఏప్రిల్ 4 శనివారం రేకులపల్లి గ్రామంలోని ఓ సెల్ టవర్ సమీపంలో అతని మృతదేహం కనిపించింది.

ఈ ఘటన గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ధర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ బిక్షపతి, సిరికొండ ఎస్సై రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. రాజశేఖర్ మృతికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా, ఇది ఆత్మహత్యా? లేక ఇతర అనుమానాస్పద కారణాలా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన రేకులపల్లి గ్రామంలో విషాదాన్ని నింపింది.








