|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా శంకరంపేట్ (ఆర్) పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగరాయి గ్రామంలో వృద్ధ దంపతులపై దాడి, దారుణ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న సమయంలో గుర్తుతెలియని దుండగుడు అంజయ్య, సావిత్రి నివాసంలోకి చొరబడి సుత్తితో దాడి చేసి, వారి వద్ద ఉన్న సుమారు 5 తులాల బంగారు ఆభరణాలను దోచుకుని బైక్పై పరారైనట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన దంపతులను స్థానికులు వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి, నిందితుడి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఘటనాస్థలంలో లభ్యమైన ఆధారాలను సేకరిస్తూ, నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు. అదనపు ఎస్పీ వెంట తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సీఐ వెంకట రాజా గౌడ్, ఎస్ఐ నారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఘటనతో జంగరాయి గ్రామంలో భయాందోళన నెలకొంది.








