అంతర్రాష్ట్ర గంజా విక్రేతలు ఏడుగురు అరెస్టు – 2.1 కిలోల గంజా స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ పోలీస్ ప్రత్యేక దళాలు మరోసారి అంతర్రాష్ట్ర గంజా మాఫియాను బట్టబయలు చేశాయి. గురువారం మధ్యాహ్నం మోపాల్ మండల పరిధిలోని కంజర్ గ్రామ శివారు ప్రాంతంలో గంజా అమ్మకాలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న వెంటనే, ఎస్‌.ఐ. జి. సుష్మిత సిబ్బందితో కలిసి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులు అదుపులోకి తీసుకోబడ్డారు.

అరెస్ట్ అయిన నిందితులు A1 అలీ అమీర్ ఖాన్, A2 షేక్ అఫ్రోజ్, A3 బత్నాష్ శివ లను విచారణ చెయ్యగా వీరు నాందేడ్ ప్రాంతానికి ట్రైన్ల ద్వారా వెళ్లి, అక్కడి సరఫరాదారులైన A4 షేక్ ఇమ్రాన్, A5 మిర్జా జుబైర్ బెగ్, A6 అమూల్ చౌరే, A7 షేక్ షేర్ ఖాన్ వద్ద నుండి కిలో గంజాను ₹10,000కి కొనుగోలు చేసి, నిజామాబాద్ మోపాల్ ప్రాంతంలో చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి యువతకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

స్థానికంగా వీరు 5 గ్రాముల గంజా ప్యాకెట్‌ను ₹200–₹300కి విక్రయిస్తూ, ముఖ్యంగా యువత, కాలేజీ విద్యార్థులు, మైనర్లను టార్గెట్ చేసేవారని పోలీసులు వెల్లడించారు. ఈ సమాచారంతో నాందేడ్‌కు వెళ్లిన ఎస్‌.ఐ. సుష్మిత, తన బృందంతో కలిసి మిగతా నలుగురు సరఫరాదారులను కూడా అరెస్ట్ చేసి మొత్తం ఏడుగురు నిందితులను చట్టపరమైన ప్రక్రియలో భాగంగా కోర్టుకు హాజరుపరిచారు.

ముగ్గురు నిందితుల వద్ద నుండి 1.2 కిలోల గంజా
నాందేడ్ నిందితుల వద్ద నుండి 900 గ్రాముల గంజా
మొత్తం 2.1 కిలోల గంజా, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ– గంజా, డ్రగ్స్ కొనడం, అమ్మడం, నిల్వ చేసుకోవడం నేరమని, ఇవి యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, డ్రగ్స్ అక్రమ రవాణా లేదా విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment