అధికారులు నిర్లక్ష్యంతో పశువుల పాకను తలపిస్తోన్న ప్రయాణ ప్రాంగణం.

|| దృశ్యం న్యూస్ ||

బోధన్ – బాసర – నిజామాబాద్ ప్రాంతాలకు ప్రయాణికులు ప్రయాణం చెయ్యడానికి ప్రధాన కేంద్రమైన జానకంపేట్ గ్రామ ప్రయాణ ప్రాంగణం ప్రస్తుతం పశువుల పాకను తలపిస్తోంది. ఈ ప్రాంగణంలో పారిశుధ్య లోపం, మరమ్మత్తుల లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా శిథిలావస్థకు చేరింది.
ప్రతి రోజు వందలాది మంది ప్రయాణికులు ఈ ప్రాంగణాన్ని ఉపయోగించాల్సి వుంది, కానీ, మరుగుదొడ్లు లేకపోవడం, నీటి సౌకర్యం లేకపోవడం, ఆర్టీసీ సిబ్బంది గైర్హాజరు వంటి సమస్యలు తీవ్రమయ్యాయి. ఫలితంగా ప్రయాణికులు అసౌకర్యానికిలోనై ఈ ప్రాంగణాన్ని వదిలి గ్రామ ప్రధాన కూడలి అయిన శివాజీ చౌరస్తా వద్ద బస్సుల కోసం వేచి ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు పెరిగి, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
అదేవిధంగా రాత్రివేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారిన ఈ ప్రాంగణం స్థానికులకు ఇబ్బందికరంగా మారింది.

శివాజీ చౌరస్తా వద్ద చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు వర్షం, ఎండతో ఇబ్బంది పడుతు సరైన సదుపాయాలు లేక ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించడం వలన ఆ వాహనదారులు లబ్ది పొందుతున్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ, “ప్రయాణ ప్రాంగణం కోసం మా పూర్వికులు కేటాయించిన స్థలం ఈరోజు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది అని, అధికారులు తక్షణ చర్యలు తీసుకోకపోతే, మేమే గ్రామ అభివృద్ధి కోసం చర్యలు చేపడతాం” అని హెచ్చరిస్తున్నారు.
ప్రభుత్వం మహిళ ప్రయాణికులకు ఉచిత ప్రయాణం అందించడం మంచి విషయం కానీ, ప్రయాణికులకు సరైన సౌకర్యాలు ప్రాంగణా శుభ్రత, సురక్షితతో ఉన్నతంగా తీర్చిదిద్దే చర్యలు తీసుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.

ఇకనైనా జానకంపేట్ ప్రయాణ ప్రాంగణంలో సంబంధిత అధికారులు తక్షణ పారిశుధ్య చర్యలు చేపట్టి
మరుగుదొడ్లు, లైటింగ్, నీటి వసతులు కల్పించాలి అని,
ఆర్టీసీ సిబ్బందిని నియమించి, ప్రయాణికులకు సమాచారం అందించే సౌకర్యం కల్పించాలి అని గ్రామస్తులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment