30 గుంటల పరిశ్రమకు 300 గజాల పన్ను – ఆధికారుల పని తీరు భేష్ అంటున్న ప్రజలు.

|| దృశ్యం న్యూస్ ||

ఎడపల్లి, నిజామాబాద్ జిల్లా:
ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో కొనసాగుతున్న ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ పరిశ్రమ మరోసారి వివాదాస్పదంగా మారింది. సుమారు 30 గుంటల విస్తీర్ణంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ పరిశ్రమకు గ్రామ పంచాయతీ అధికారులు కేవలం 300 గజాల విస్తీర్ణానికి మాత్రమే పన్ను విధించి అనుమతులు జారీ చేసినట్లు వెలుగులోకి రావడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మూడు నెలల క్రితం నోటీసులు.. ఇప్పుడు 300 గజాలకు పన్ను.

స్థానికుల వివరాల ప్రకారం, ఈ పరిశ్రమ గత రెండేళ్లుగా పూర్తి స్థాయి ప్రభుత్వ అనుమతులు లేకుండానే కొనసాగుతోంది. మూడు నెలల క్రితం ఇదే పరిశ్రమకు అవసరమైన అనుమతులు లేవని పేర్కొంటూ గ్రామ పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే ఇప్పుడు అదే అధికారులు 300 గజాల పేరుతో సుమారు రూ.19 వేల గృహాధారిత పన్ను విధించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

“30 గుంటల విస్తీర్ణంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిశ్రమను కేవలం 300 గజాల స్థలంగా నమోదు చేయడం వెనుక అసలు కారణాలేమిటన్న ప్రశ్నలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం లేదా ఇతర వ్యక్తిగత ప్రయోజనాలు దాగి ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నమోదు ప్రక్రియ అవినీతికి నిదర్శనం అనే సందేహాలను స్థానికులు బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు.”

పర్యావరణ, పరిశ్రమ శాఖ అనుమతులు లేకుండానే నిరభ్యంతరంగా కొనసాగుతున్న కార్యకలాపాలు.

ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్‌కు పరిశ్రమ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి (PCB) మరియు పర్యావరణ శాఖల అనుమతులు తప్పనిసరి. అయితే సంబంధిత అనుమతులు లేకుండానే 8వ ఇండస్ట్రియల్ కేటగిరీ కింద పన్ను విధించడం చట్టబద్ధతపై సందేహాలు రేకెత్తిస్తోంది. పరిశ్రమ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముందని గ్రామస్థులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.
గ్రామ సభల్లో కూడా ఈ పరిశ్రమను గ్రామ పరిధి నుంచి తొలగించాలని తీర్మానాలు చేసిన సంబంధిత అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ వ్యవహారంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో), డివిజనల్ పంచాయతీ అధికారుల ప్రమేయం ఉందని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ అంశంపై వచ్చిన ఫిర్యాదును పరిశీలించిన బోధన్ సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని సదరు అధికారులు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

అనుమతులు లేని పరిశ్రమకు పన్ను ఎలా విధించారో, 30 గుంటల విస్తీర్ణంలో ఉన్న పరిశ్రమను కేవలం 300 గజాలుగా ఎలా నమోదు చేశారో అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నత అధికారులకు గ్రామస్థులు డిమాండ్ చేస్తు, అలాగే ఈ వ్యవహారంపై సరైన స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment