పంచాయతీ నిధుల దుర్వినియోగం..? ఫోర్జరీ సంతకాలతో అక్రమాలు..? పంచాయతీ కార్యదర్శిపై ప్రజావాణిలో ఫిర్యాదు.

|| దృశ్యం న్యూస్ ||

నవీపేట్, నిజామాబాద్ జిల్లా:
నవీపేట్ మండలంలోని అబ్బాపూర్ (యం) గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ సంతకాలు, అధికార దుర్వినియోగం జరిగినట్లు గ్రామ పంచాయతి పాలకవర్గ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అధికారిక ఫిర్యాదు సమర్పించి సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

గ్రామ పంచాయతి పాలకవర్గం ఏర్పడి దాదాపు ఏడు నెలలు గడిచినా, గ్రామ పంచాయతికి సంబంధించిన ఆదాయం-వ్యయం లెక్కలు, అభివృద్ధి పనుల ఖర్చులు, నిధుల వినియోగ వివరాలను కార్యదర్శి వెల్లడించకుండా గోప్యంగా ఉంచుతున్నారని సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు ఆరోపించారు. పలుమార్లు లిఖితపూర్వకంగా వివరాలు కోరినా స్పందన లేకపోవడంతో సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తు చేసుకున్నప్పటికీ తప్పుడు సమాచారం అందించలేదని పేర్కొన్నారు.

అంతేకాకుండా, గతంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన నరేందర్ సంతకాలను ఫోర్జరీ చేసి రికార్డులు రూపొందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించిన బిల్లులు, వౌచర్లు, ఆర్థిక లావాదేవీలలో అనేక అనుమానాస్పద అంశాలు ఉన్నాయని, ఈ వ్యవహారంపై లోతైన విచారణ నిర్వహిస్తే భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు.

గ్రామ పంచాయతికి ఎలాంటి అధికారిక హోదా లేదా బాధ్యతలు లేని కార్యదర్శి భర్త పలుమార్లు పంచాయతి ఖాతా నుంచి నగదు ఉపసంహరణలు చేసినట్లు ఆరోపణలు రావడం మరింత వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ నిధుల నిర్వహణలో నియమ నిబంధనలు ఉల్లంఘించబడ్డాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక గ్రామ ప్రజలకు అవసరమైన జనన, మరణ, నివాస ధృవీకరణ పత్రాలు మరియు ఇతర సేవలు సకాలంలో అందడం లేదని, కార్యదర్శి ప్రతిరోజూ పరిమిత సమయం మాత్రమే కార్యాలయంలో ఉండి, మిగిలిన సమయంలో వివిధ సమావేశాల పేరుతో గైర్హాజరవుతున్నారని ఆరోపించారు. సమస్యలపై ప్రశ్నించిన ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు కూడా వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతి నిధుల వినియోగం, ఫోర్జరీ సంతకాల ఆరోపణలు, అక్రమ ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ పంచాయతి పాలకవర్గ సభ్యులు జిల్లా ఉన్నతాధికారులను కోరారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా తక్షణ చర్యలు తీసుకొని గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్, ఉపసర్పంచ్ శివతో పాటు పలువురు వార్డు సభ్యులు పాల్గొని తమ ఫిర్యాదును అధికారులకు సమర్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment