గ్రామ పంచాయతీ వ్యాపార గదులపై నిర్లక్ష్యం..! 20 ఏళ్లుగా వేలంపాట లేక గ్రామ ఆదాయానికి భారీ గండి.

|| దృశ్యం న్యూస్ ||

సాలూరా, నిజామాబాద్ జిల్లా:
సాలూరా గ్రామపంచాయతీకి చెందిన వ్యాపార గదుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. పంచాయతీకి చెందిన ఐదు వ్యాపార గదులు గత 20 సంవత్సరాలుగా బహిరంగ వేలంపాట నిర్వహించకుండా అదే వ్యక్తుల ఆధీనంలో కొనసాగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల గ్రామపంచాయతీకి లభించాల్సిన ఆదాయం కోల్పోతుండగా, గ్రామాభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రభావితమవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీరాజ్ శాఖ నిబంధనల ప్రకారం గ్రామపంచాయతీ ఆస్తులను నిర్దిష్ట వ్యవధిలో బహిరంగ వేలంపాట ద్వారా కేటాయించి, మార్కెట్ విలువకు అనుగుణంగా అద్దెలను పునర్నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే సాలూరా గ్రామంలో రెండు దశాబ్దాలుగా ఈ ప్రక్రియ పూర్తిగా పక్కనపడినట్లు కనిపిస్తోంది.
ప్రస్తుతం గ్రామంలో ఉన్న వాణిజ్య పరిస్థితులను పరిశీలిస్తే ఒక్కో గదికి నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు అద్దె వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, పాత లీజు ఒప్పందాల ఆధారంగా రూ.1,400కు మించని అద్దె మాత్రమే పంచాయతీకి అందుతున్నట్లు సమాచారం. ఫలితంగా ప్రతి నెల వేలాది రూపాయల ఆదాయం నష్టపోతున్న పరిస్థితి నెలకొంది.

ఈ వ్యవహారంలో అధికారుల పర్యవేక్షణ లోపించిందా? లేక రాజకీయ ఒత్తిళ్ల కారణంగా వేలంపాటలు నిలిచిపోయాయా? అనే ప్రశ్నలు గ్రామస్థుల నుంచి వినిపిస్తున్నాయి. కొందరు ప్రభావశీలులు తమ స్వప్రయోజనాల కోసం రాజకీయ పలుకుబడి ఉపయోగించి బహిరంగ వేలంపాటలను అడ్డుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కాబట్టి జిల్లా, మండల స్థాయి అధికారులు వెంటనే జోక్యం చేసుకుని పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని, గ్రామపంచాయతీ ప్రత్యేక తీర్మానం చేసి ప్రస్తుత లీజులను సమీక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తు, ఉన్నతాధికారుల సమక్షంలో పారదర్శకంగా బహిరంగ వేలంపాట నిర్వహించి అత్యధిక అద్దె చెల్లించేందుకు ముందుకొచ్చే అర్హులకే గదులు కేటాయించాలని కోరుతున్నారు.
గ్రామపంచాయతీ ఆదాయ వనరులను పరిరక్షించడం అధికారుల బాధ్యత అని, నిబంధనలకు విరుద్ధంగా లీజులు కొనసాగించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు స్పష్టం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment