|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్: ఎడపల్లి మండలం, జానకంపేట్ గ్రామంలో అక్రమ నాన్-లేఅవుట్ వెంచర్లపై పంచాయతీ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చెయ్యడం, అజ్ఞాత వ్యక్తులు వాటిని ధ్వంసం చెయ్యడం, అధికారుల మౌనం వహించడం, గ్రామస్థుల్లో ఓ వివాదాస్పద చర్చగా మారింది.
జానకంపేట్‌లో అక్రమ నాన్-లేఅవుట్ వెంచర్ల వ్యవహారం రోజురోజుకీ ఉద్రిక్తంగా మారుతోంది. గ్రామస్తుల ఫిర్యాదుల నేపథ్యంలో పంచాయతీ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, అవి మరుసటి రోజే గుర్తు తెలియని వ్యక్తుల చేత తొలగించబడటం తీవ్ర అనుమానాలకు దారి తీసింది. ఈ చర్యలు మొత్తం కేవలం నామమాత్రంగా జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
బోర్డుల ధ్వంసంపై ఇప్పటివరకు ఏ అధికారి కూడా ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం మరింత చర్చనీయాంశంగా మారింది.
అక్రమ వెంచర్ల నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పూర్తిగా మౌనం వహించడం వెనుక రాజకీయ ప్రభావం ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు అందుకున్న వెంటనే నోటీసులు జారీ చేయడం, హెచ్చరిక బోర్డులో ఏర్పాటు చేసిన రోజే ప్లాట్లుగా విభజించిన హద్దు రాళ్లను తొలగించడం, నిర్వహకులకు జరిమానాలు విధించడం వంటి ప్రాథమిక చర్యలు కూడా కనిపించకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.
పంచాయతీ, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, నుడా, పోలీస్ శాఖల అధికారుల మౌనం వెనక ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ఉందా అన్న ప్రశ్నలు ప్రజల్లో ఉత్కంఠ కలిగిస్తున్నాయి. బోర్డులు ఏర్పాటు చేసి వాటిని ధ్వంసం చేయించడమే అక్రమార్కుల అసలు ఉద్దేశమా? ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో ప్రజాప్రతినిధులు ఆడిన నాటకీయ చర్యలా? అనే అనుమానాలు కూడా ఎన్నో వ్యక్తమవుతున్నాయి.
మొత్తం వ్యవహారం చూస్తే అక్రమ వెంచర్లకు కొంతమంది కీలక ప్రజాప్రతినిధుల అండ ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తోంది. ఏదిఏమైనా ఇకనైనా ఈ నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తు, ఇలాంటి అక్రమ లేఅవుట్ల కారణంగా చివరికి నష్టపోయేది అమాయక ప్రజలేనని అధికారులు గ్రహించాలని వారు హెచ్చరిస్తున్నారు.








