పంచాయతీ హెచ్చరిక బోర్డుల ధ్వంసం – ఫిర్యాదు ఉన్న పోలీసుల చర్యలు శూన్యం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అక్రమ నాన్-లేఅవుట్ వెంచర్ల వ్యవహారం రోజు రోజుకు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. గ్రామ సభలోని గ్రామస్తుల ఫిర్యాదుల మేరకు తీర్మానమైన అక్రమ నాన్-లేఅవుట్ వెంచర్లపై గ్రామ పంచాయతీ అధికారులు ఇటీవల నాలుగు ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి ప్రజలకు అప్రమత్తత కల్పించేందుకు ప్రయత్నించారు.
అయితే, ఆ బోర్డులు ఏర్పాటు చేసిన మరుసటి రోజే గుర్తుతెలియని వ్యక్తులు వాటిని ధ్వంసం చేసి తొలగించడం స్థానికంగా కలకలం రేపింది.

ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి, పాలకవర్గ సభ్యులు కలిసి ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు కనిపించకపోవడం గ్రామస్థుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ ధ్వంసం వెనుక ఉన్న ఆ అజ్ఞాత వ్యక్తి గురించి గ్రామంలో బహిరంగంగానే చర్చ జరుగుతున్నప్పటికీ, పోలీసులు అతడిని గుర్తించలేకపోవడం ఏమిటని? పోలీసు శాఖ తీరుపై గ్రామస్థుల్లో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

అలాగే ఈ అక్రమ లేఅవుట్ల వెనుక ప్రభావశీలుల పాత్ర, రాజకీయ ఆశ్రయం, మరియు అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం కలిసి అడ్డు అదుపు లేకుండా సాగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు అవినీతికి పాల్పడ్డారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అనుమతులు లేని భూములపై చట్టవిరుద్ధంగా ప్లాట్ల విక్రయాలు కొనసాగుతుండగా, ప్రభుత్వ భూములను అక్రమంగా కబ్జాలు చేస్తున్న, సంబంధిత శాఖలు మౌనం పాటించడం ఆందోళన కలిగిస్తోంది. ఇకనైనా
ఈ అక్రమాలకు అడ్డుకట్ట పడేనా?
అ అజ్ఞాత వ్యక్తికి శిక్ష పడేనా?
లేదా ఈ అధికారుల అంధకార, అలసత్వ ప్రదర్శన కొనసాగేనా? వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment