నత్తనడకన సాగుతున్న వరి కొనుగోలు – రైతుల ఆవేదన.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్: ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో వరి కొనుగోలు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజులు గడిచినా ధాన్యం ఎత్తిపోతలలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో రైతులు ఎదురు చూపులతోనే కాలం గడుపుతున్నారు. ఇప్పటికే కోత పూర్తి చేసి కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన వరి ధాన్యం ఎప్పుడెప్పుడు కొనుగోలు చేస్తారోనని రైతులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కేంద్రాల వద్ద సరైన వసతుల లేమి, హమాలీల కొరత, రవాణా వాహనాలు అందుబాటు లేకపోవడం వంటి సమస్యలు కొనుగోలు వేగాన్ని తీవ్రంగా ఆలస్యం చేస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పరిస్థితి మరింత దిగజారుతోంది అని.. ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన వరి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, స్థానిక స్థాయిలో అమలు జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.

కొనుగోలు కేంద్రాల చుట్టూ వరి ధాన్యాన్ని అరబోసి రైతులు రోజుల తరబడి కాపలా కాస్తున్నారు. మబ్బులు కమ్ముకున్నప్పుడల్లా ఈదురుగాల సంభవిస్తాయోమో, వర్షం పడుతుందేమోనన్న భయంతో ఆందోళన చెందుతున్నారు. ఆలస్యమవుతున్న కొనుగోలు ప్రక్రియ కారణంగా కొంతమంది రైతులు దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది, దీని వల్ల వారికి నష్టాలు చేకూరుతున్నాయి.. గత వారం రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ సంబంధిత సొసైటీ ప్రత్యేక అధికారి, మండల వ్యవసాయ అధికారి వంటి బాధ్యులు కేంద్రాన్నీ సందర్శించకపోవడం రైతుల్లో మరింత అసంతృప్తిని పెంచుతోంది. అంతేకాకుండా, వరి కొనుగోలు నమోదు ప్రక్రియ కూడా అధికారుల అలసత్వం వల్ల చాలా ఆలస్యంగా సాగుతుండటంతో రైతులు మరింత ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది.

ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలు, ఈదురు గాలులతో దిగుబడి తగ్గిన నేపథ్యంలో కొనుగోలు ఆలస్యం మరింత నష్టాన్ని కలిగించేలా ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment