|| దృశ్యం న్యూస్ ||
మెదక్ అవుట్డోర్ స్టేడియంలో మెదక్ ఫుట్ బాల్ అకాడమీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద ముఖ్య అతిథిగా హాజరై, విద్యార్థులతో కలిసి ఫుట్ బాల్ ఆడి వారిని ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా లక్ద్మీ శారద మాట్లాడుతూ, మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వారికి అందుతున్న అవకాశాలు, సమాజంలో వారు సాధిస్తున్న విజయాల గురించి చర్చించారు. భవిష్యత్తులో యువత తాము ఏం సాధించాలనే లక్ష్యంతో కలల పుస్తకాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ సహకారంతో “బేటీ బచావో – బేటీ పడావో” కార్యక్రమంలో భాగంగా జాతీయ స్థాయిలో రాణించిన బాలికలకు అందరికి స్పోర్ట్స్ కిట్స్ అందజేసినట్లు తెలిపారు. మెదక్, చేగుంట, నర్సాపూర్, తూప్రాన్, మనోహరాబాద్, కౌడిపల్లి, పాపన్నపేట మండలాల నుండి సాఫ్ట్ బాల్, హ్యాండ్ బాల్, ఫుట్బాల్, క్రికెట్, జిమ్నాస్టిక్స్, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రదర్శన కనబరిచారని పేర్కొన్నారు.

అదేవిధంగా జిల్లా యువజన మరియు క్రీడా శాఖ అధికారి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, ఫుట్ బాల్ మైదానాన్ని మెరుగుపరిచేందుకు ఇప్పటికే 8 టిప్పర్ల ఇసుకను వేసి, శిక్షణకు అనుకూలంగా రూపొందించినట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ మహిళా సాధికారత కేంద్రం, ( స్త్రీ & శిశు సంక్షేమ శాఖ), ఫుట్ బాల్ అకాడమీ అధ్యక్ష కార్యదర్శులు, మెదక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ సభ్యులు, శిక్షకులు, స్టేడియం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.








