జానకంపేట్ అష్టముఖి పుష్కరిణి వద్ద అమావాస్య సందడి – భక్తుల రాకకు అన్ని ఏర్పాట్లు పూర్తి.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్: జానకంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పరిధిలోని ప్రసిద్ధ అష్టముఖి పుష్కరిణి (కోనేరు)కి రేపు శనివారం అమావాస్య సందర్భంగా భారీ భక్తజనం తరలివచ్చే అవకాశముండటంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

దక్షిణ భారతదేశంలో విశిష్ట ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు పొందిన శ్రీ లక్ష్మినరసింహ స్వామి ఆలయ ఆవరణలో గల అష్టముఖి (కోనేరు) పుష్కరిణిలో శనివారం నాడు వచ్చే అమావాస్య, అష్టమి తిధుల సందర్భంగా తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి పవిత్ర స్నానాలు ఆచరిస్తుంటారు.

ప్రత్యేకంగా శనివారం రోజున అమావాస్య తిధి కలిసివస్తే అష్టముఖి పుష్కరిణిలో స్నానం చేయడం మహా పుణ్యఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా భక్తులు కోనేరు చుట్టూ ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేస్తూ, ఎనిమిది మూలాల వద్ద నవధాన్యాలు సమర్పించి “ఓం నమో నారాయణాయ” అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివార్ల ఆశీస్సులు పొందుతారు.

అష్టముఖి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి ప్రత్యేక పూజలు చేస్తే గ్రహదోషాలు తొలగి ఆయురారోగ్యాలు, సుఖశాంతులు కలుగుతాయని భక్తులు గాఢంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో రేపటి అమావాస్య సందర్భంగా వేలాదిమంది భక్తులు రానున్నట్లు అంచనా వేస్తున్న ఆలయ అధికారులు తాగునీటి సౌకర్యం, క్యూలైన్లు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ వెలుగులు, వాహన పార్కింగ్, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు.
భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ సహకారంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు. భక్తులు కూడా క్రమశిక్షణ పాటిస్తూ ఆలయ సిబ్బందికి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment