|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్: ఎడపల్లి మండలం, పోచారం గ్రామంలో ఉపాధి హామీ పనుల సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ మరియు కూలి మధ్య జరిగిన ఘర్షణ స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే ఉపాధి హామీ కూలి పనికి ఆలస్యంగా వచ్చాడనే కారణంతో ఫీల్డ్ అసిస్టెంట్ చంద్ర ప్రకాష్ దుర్భాషలాడుతూ దాడి చేశాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ ఘటన అనంతరం ఇరువురు ఎడపల్లి పోలీస్ స్టేషన్‌లో పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
ఒక ప్రభుత్వ పథకంలో పనిచేస్తున్న కూలిపై అధికార ప్రతినిధి దాడి చేయడం తగదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కూలీల హాజరు నమోదు విషయంలో ఫీల్డ్ అసిస్టెంట్ చంద్ర ప్రకాష్ అవకతవకలు చేస్తూ అవినీతి పాల్పడుతున్నాడని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కొందరు వ్యక్తులు ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి కార్యకలాపాలకు అండదండలు అందిస్తున్నారని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.
పేదలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఇలా దుర్వినియోగం చేసే వారిపై సంబంధిత ఉన్నత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.








