అక్రమ వెంచర్ల దందా.. లేఅవుట్ అనుమతులు లేకుండానే దర్జాగా ప్లాట్ల అమ్మకాలు – కొనుగోలుదారులకు భారీ మోసం!

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామంలో అక్రమ వెంచర్ల దందా రోజురోజుకూ బహిర్గతమవుతోంది. ప్రభుత్వ శాఖల అనుమతులు లేకుండా, లేఅవుట్ లేని భూములను ఇండ్ల స్థలాలుగా విభజించి అమ్మకాలు జరుపుతున్న ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జానకంపేట్–నవిపేట్ ప్రధాన రహదారి పక్కన, రైల్వే గేటు సమీపంలో ఉన్న సర్వే నంబర్లు 49, 50, 51, 52, 53, 771, 772, 784 పరిధిలోని భూములను కొందరు వ్యక్తులు వెంచర్ పేరుతో ప్రచారం చేస్తూ, అమాయక ప్రజలను ఆకర్షించి భారీగా ప్లాట్లు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అన్ని సౌకర్యాలు కల్పిస్తాం – తప్పుడు హామీలు..

విశేషమేమిటంటే, ఈ భూములు NUDA (నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) పరిధిలో వినోద స్థలంగా (Recreation) నిర్ణయించబడినా Change of Land Use (CLU) అనుమతి లేకుండా, అలాగే The Directorate of Town & Country Planning (DTCP), లేఅవుట్ అనుమతులు లేకుండానే గత మూడు సంవత్సరాల క్రితం నుండే ఈ అక్రమ ప్లాట్ల విక్రయాలు కొనసాగుతున్నాయని సమాచారం. “త్వరలో రోడ్లు వేస్తాం, విద్యుత్ సదుపాయం కల్పిస్తాం, డ్రైనేజీ సౌకర్యాలు ఏర్పాటు చేస్తాం” అంటూ కొనుగోలుదారులకు తప్పుడు హామీలు ఇచ్చి, లక్షల రూపాయలు వసూలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ఆ ప్రదేశంలో ఎటువంటి మౌలిక వసతులు కల్పించకపోవడం, ఇది పూర్తి స్థాయి రియల్ ఎస్టేట్ మోసంగా మారిందనే అనుమానాలను బలపరుస్తోంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఏదైనా లేఅవుట్ అభివృద్ధి చేయాలంటే సంబంధిత సంస్థల అనుమతులతో పాటు, గ్రామ పంచాయతీకి 10 శాతం భూమి కేటాయింపు తప్పనిసరి. కానీ దాదాపు 5 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న ఈ భూముల్లో అలాంటి కేటాయింపులు లేకుండానే అక్రమంగా ప్లాట్లుగా విభజించి విక్రయాలు జరిపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

లేఅవుట్ అనుమతులు లేకపోతే రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి?..

ఇప్పటికే ఈ మోసాన్ని గుర్తించిన పలువురు కొనుగోలుదారులు, కొనుగోలు చేసిన స్థలాల్లో ఇల్లు నిర్మించలేక, తిరిగి అమ్మలేక, న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో అత్యంత కీలకమైన ప్రశ్న ఏమిటంటే – లేఅవుట్ అనుమతులు లేకపోతే రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి? ఎవరి సహకారంతో జరిగాయి? ఏ ఆధారాలపై విక్రయాలు కొనసాగాయి? అనే అంశాలపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉంది. NUDA అధికారులు, రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతీ, రిజిస్ట్రేషన్ శాఖలు తక్షణమే సంయుక్తంగా విచారణ చేపట్టి, ఈ అక్రమ వెంచర్ నిర్వహిస్తున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

గత అధికారుల అవినీతి.. ప్రస్తుత అధికారుల ఉదాసీనత..

ఈ భారీ మోసం వెనుక గత స్థానిక అధికారులు, గ్రామ పాలకవర్గం అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారులు అవినీతికి పాల్పడి, అక్రమ వెంచర్ల దందాకు పరోక్షంగా సహకరించారనే ఆరోపణలు స్థానికంగా తీవ్ర చర్చకు దారితీశాయి. విచారకరమైన విషయం ఏమిటంటే, ప్రస్తుతం ఉన్న కొందరు అధికారులు కూడా మోసపోయిన కొనుగోలుదారుల బాధను అర్థం చేసుకోవాల్సింది పోయి, ‘కొన్నది మీరే… ఇప్పుడు ఇబ్బందులు మీకే’ అన్నట్టుగా నిర్లక్ష్యంగా, కఠినంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రజల జీవిత పొదుపులను లక్ష్యంగా చేసుకుని, అనుమతులు లేని ప్లాట్ల అమ్మకాల పేరిట జరుగుతున్న ఈ అక్రమ భూముల దందాను వెంటనే అడ్డుకోకపోతే భవిష్యత్తులో మరెన్నో భూకుంభకోణలకు మార్గదర్శకంగా మారే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. అమాయక కొనుగోలుదారులను మోసం చేస్తున్న ఇలాంటి అక్రమార్కులపై ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తే మరిన్ని కుటుంబాలు ఎన్నో విధాలుగా నష్టపోయే అవకాశం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment