|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెంజల్ గ్రామానికి చెందిన గాండ్ల సతీష్ (30) ద్విచక్ర వాహనంతో సహా కాలువలో పడి మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. మృతుడు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం రాత్రి డ్యూటీ ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరిన సతీష్, జానకంపేట్ ప్రధాన రహదారి వద్ద నిజాంసాగర్ కాలువ సమీపంలో బైక్ అదుపుతప్పి కాలువలో పడిపోయినట్లు ప్రాథమిక సమాచారం.
స్థానికుల సమాచారం మేరకు ఎడపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువకుడిని బయటకు తీశారు. వెంటనే బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. ఈ విషాద ఘటనతో కుటుంబ సభ్యులు, సహోద్యోగుల్లో తీవ్ర శోకం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టారు.








