|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, జానకంపేట్ గ్రామంలో అనుమతులు లేకుండా కొనసాగుతున్న ప్లాస్టిక్ ఇండస్ట్రీ యాజమాన్యం అధికారిక నోటీసులను సైతం లెక్కచేయకుండా అహంకారంగా వ్యవహరిస్తోంది.
గత నెల “అనుమతుల్లేని అక్రమ పరిశ్రమ – అధికారుల అవినీతి, నిర్లక్ష్యానికి బహిరంగ సాక్ష్యం” అనే శీర్షికతో దృశ్యం న్యూస్ ప్రచురించిన కథనానికి స్పందించిన గ్రామ పంచాయతీ ఈ నెల 8వ తేదీన సంబంధిత సంస్థకు నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో అవసరమైన అన్ని ప్రభుత్వ శాఖల అనుమతులు పంచాయతీ కార్యాలయానికి సమర్పించాలని, లేనిపక్షంలో పరిశ్రమను మూసివేస్తామని స్పష్టంగా హెచ్చరించింది.
అయితే నోటీసు జారీ చేసి 15 రోజులు గడిచినా, సంస్థ యాజమాన్యం వివిధ కారణాలు చెప్పుతూ కాలయాపన చేస్తూ ఇప్పటివరకు ఒక్క అనుమతి కూడా సమర్పించలేదని సమాచారం. ఇది సంస్థకు ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేవన్నదానికి స్పష్టమైన నిదర్శనంగా గ్రామస్థులు భావిస్తున్నారు. అంతేకాదు, పంచాయతీ నోటీసులను బేఖాతరు చేసే ధోరణి వెనుక కొందరు గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధుల అండ ఉందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
పరిశ్రమ వల్ల పర్యావరణ కాలుష్యం, ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతున్నప్పటికీ అధికారులు మౌనంగా ఉండటం పట్ల గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తు, ఇకనైనా పంచాయతీ అధికారులు, గ్రామ పాలన ప్రతినిధులు బాధ్యతగా స్పందించి చట్టాన్ని అమలు చేసి, అక్రమంగా నడుస్తున్న ఈ ప్లాస్టిక్ ఇండస్ట్రీని తక్షణమే మూసివేయాలని సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.








