గుట్టలు గుంతలుగా మారుతున్న వైనం – ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆశీర్వాదంతో మైనింగ్ దందా: దినేష్ పటేల్ కులాచారి తీవ్ర విమర్శలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపూర్, గుండారం, జానకంపేట్ గ్రామ శివార్లలో జరుగుతున్న అక్రమ మొరం తవ్వకాలు జిల్లాలో సంచలనంగా మారాయి. ఈరోజు ఉదయం అక్కడికెళ్లిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి మొరం తవ్వకాలు చేసే ప్రాంతాన్ని పరిశీలన నిర్వహించి, మైనింగ్ మాఫియాపై మండిపడ్డారు.

దినేష్ పటేల్ మాట్లాడుతూ, ప్రభుత్వ భూముల్లో జరుగుతున్న ఈ అక్రమ తవ్వకాలకు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆశీర్వాదం ఉందని తీవ్రంగా ఆరోపించారు. ప్రజల కోసమై ఉపయోగించవలసిన భూములను కాంగ్రెస్ నేతలు వ్యక్తిగత లాభాల కోసం దోపిడీ చేస్తున్నారని, మల్కాపూర్, జానకంపేట్ పరిసరాల్లో మొరం అక్రమ రవాణా వందల టిప్పర్లతో రోజువారీగా జరుగుతోందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

 

రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయి, అవినీతి పరాకాష్టకు చేరిందని దినేష్ పటేల్ ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజల సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదు అని విమర్శించారు. కేవలం ఫోటోలు, ప్రకటనలకే పరిమితమైన ఇంచార్జి మంత్రుల పనితీరును దినేష్ పటేల్ ఎద్దేవా చేశారు.

“ప్రజల కోసం పనిచేయాల్సిన ఎమ్మెల్యే, అధికారులను పాదసేవకులుగా మార్చుకుంటున్నారు” అని మండిపడుతూ, ఒక అధికారి “ఎంఎల్ఏ చెప్పితేనే పర్మిషన్ ఇస్తా” అని అన్నాడని, ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు వ్యాఖ్యగా అభివర్ణించారు. ఈ సందర్భంగా MRO ఆడియో కాల్‌ను మీడియా ముందు విడుదల చేసి, వెంటనే ఈ ఘటన పై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేశారు.

“భూపతి రెడ్డి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి” అని దినేష్ పటేల్ స్పష్టం చేశారు. లేనిపక్షంలో ప్రజలు రాబోయే రోజుల్లో తగిన శిక్ష విధిస్తారని హెచ్చరించారు. ప్రజల హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ వెనక్కి తగ్గదని, అధికార దుర్వినియోగాన్ని ఎదిరించడానికి సిద్ధంగా ఉంటుందని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని పేదలను బెదిరించడం కాంగ్రెస్ నేతల లక్ష్యమైందని దుయ్యబట్టారు. ప్రజల పక్షాన నిలబడి అక్రమాల కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో రూరల్ కన్వీనర్ పద్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు రాంచందర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment