|| దృశ్యం న్యూస్ ||
అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ రాకెట్‌ను చేదించి కామారెడ్డి జిల్లా పోలీసులు మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ ముఠాను కామారెడ్డి పోలీసులు భద్రతా చాతుర్యంతో బట్టబయలు చేశారు. మొత్తం 12 మంది సభ్యులలో 8 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, రూ.3.08 లక్షల నకిలీ కరెన్సీ, రూ.15,300 అసలు నోట్లు, ప్రింటర్లు, స్కానర్లు, లామినేటర్, బాండ్ పేపర్లు, సెక్యూరిటీ థ్రెడ్స్ వంటి సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర,ఆదేశాల మేరకు, ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి పర్యవేక్షణలో అధికారులు ఎనిమిది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశాయి. సెప్టెంబర్ 23న కామారెడ్డి లోని స్లోకా వైన్స్ వద్ద రెండు ₹500 నకిలీ నోట్లతో మద్యం కొనుగోలు చేసిన వ్యక్తి ఆధారంగా కేసు నమోదు అయింది. విచారణలో రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన సిద్ధ గౌడ్ అరెస్ట్ చెయ్యడంతో అతడు ఫేస్బుక్లో నకిలీ నోట్ల గ్రూప్‌ల ద్వారా వెస్ట్ బెంగాల్‌కు చెందిన సౌరవ్ డేతో సంప్రదించి, రూ.5,000 చెల్లించి రూ.10,000 విలువైన ఫేక్ నోట్లు తెప్పించుకున్నట్టు ఒప్పుకున్నాడు.
తదనంతరం పోలీసులు వెస్ట్ బెంగాల్‌కి చేరి సౌరవ్ డే, హరి నారాయణ భగత్‌లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరు బీహార్‌కి చెందిన ఇబ్నుల్ రషీద్ సహాయంతో నకిలీ నోట్లు తయారు చేస్తున్నట్లు తేలింది. రషీద్ MSc కెమిస్ట్రీ చదివి రసాయన మిశ్రమాల్లో నిపుణుడు. అతడు ఛత్తీస్‌గఢ్, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన 9 మంది తో కలిసి దేశవ్యాప్తంగా ఫేక్ కరెన్సీ పంపిణీ చేశాడు.

పోలీసుల సమాచారం ప్రకారం, వీరు హర్యానా, రాజస్థాన్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ వంటి రాష్ట్రాలకు నకిలీ నోట్లు సరఫరా చేశారు. 1:2 నిష్పత్తిలో — రూ.5,000 చెల్లిస్తే రూ.10,000 విలువైన నకిలీ నోట్లు పంపేవారు. ఈ లావాదేవీలు పూర్తిగా సోషల్ మీడియా ద్వారా జరిగేవి.
పట్టుబడిన నిందితులు:
ఇబ్నుల్ రషీద్ (బీహార్), నందులాల్ జంగ్ డే (ఛత్తీస్‌గఢ్), చట్టరామ్, సౌరవ్ డే, హరి నారాయణ భగత్, పండిత్ అలియాస్ శరతక్ జా (వెస్ట్ బెంగాల్), లఖన్ కుమార్ దూబే, దివాకర్ చౌదరి (యూపీ), సత్య దేవ్ యాదవ్, శివ శర్మ (మహారాష్ట్ర), సిద్ధ గౌడ్ (తెలంగాణ), కృతిక రాజ్.
స్వాధీనం చేసిన వస్తువులు: రూ.3,08,300 నకిలీ నోట్లు, రూ.15,300 అసలు నోట్లు, Breeza Car (UP 51 BQ 3597), 9 మొబైల్ ఫోన్లు, కంప్యూటర్, ప్రింటర్లు (4), స్కానర్లు, టోనర్లు, ఫాయిల్స్, కలర్స్, కట్టర్స్, పెండ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు.
ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ, హెచ్చరికగా ప్రజలను అప్రమత్తంగా ఉండమని, సోషల్ మీడియా ద్వారా ఇలాంటి మోసపూరిత గ్రూపులను గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ ఆపరేషన్‌లో కృషి చేసిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, టౌన్ ఇన్స్పెక్టర్ నరహరి, సిబ్బంది నర్సింగ్‌రావు, రంగా రావు, రాజు, రాజశేఖర్, ఉస్మాన్ తదితరులను ఎస్పీ అభినందించారు.
కామారెడ్డి పోలీసుల ఈ అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ రాకెట్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.








