|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, సత్యనారాయణపురం గ్రామంలో రామాలయం వెనుక చర్చి ప్రాంగణంలో 50 అడుగుల ఎత్తుతో ఓ నిర్మాణాన్ని దేవ సహాయం అనే పాస్టరు చేపట్టారు. ఇదివరకు హైకోర్టు ఈ నిర్మాణంపై స్టే ఆర్డర్ ఇచ్చినా, పాస్టరు దాన్ని పట్టించుకోకుండా మళ్లీ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని హిందూ సంఘాల ఐక్యవేదిక నాయకులు ఆరోపిస్తున్నారు.
స్థానికంగా ఎలాంటి క్రైస్తవులు లేనప్పటికీ, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఈ నిర్మాణం కొనసాగుతోందని హిందూ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. చర్చి రిజిస్ట్రేషన్, అలాట్‌మెంట్ వంటి అనుమతులు లేకుండానే ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయని, స్థానిక అధికారులైన ఎమ్మార్వో, సెక్రెటరీలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

ఈ నేపథ్యంలో, హిందూ సంఘాల నాయకులు కలెక్టర్‌ను కలిసి ఈ వ్యవహారంపై తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందచేసి విజ్ఞప్తి చేశారు. పాస్టరు దేవ సహాయంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, హైకోర్టు ఉత్తర్వులను పాటిస్తూ ఆ నిర్మాణాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.
తగిన చర్యలు తీసుకోకుంటే వర్ని కేంద్రంగా తీవ్రమైన ఉద్యమం ప్రారంభిస్తామని హిందూ సంఘాల నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు పటేల్ ప్రసాద్, పిట్ల స్వామి, పార్వతి మురళి, బోత్ కిషన్, భాస్కర్, సుబ్రహ్మణ్యం స్వామి, ప్రతాప్ చోటు, ఆకాష్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.








