|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బాల్కొండ కేంద్రంలో పేరుకే ఉన్న బస్టాండ్ అనేక సంవత్సరాలుగా బస్సులు రాకపోవడంతో పెద్ద సమస్యగా మారింది. 1991 ఫిబ్రవరిలో మాజి రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఎస్. సంతోష్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించిన బాల్కొండ బస్టాండ్‌కు ఇప్పటివరకు సరైన ఆదరణ లేదు. ఇప్పటి వరకు ఈ బస్టాండ్ కు బస్సుల రాకపోకలు జరగకపోవడంతో అది పశువుల కొట్టంగా, రాత్రిళ్ళలో అసాంఘిక కార్యక్రమాలకు అనువైన స్థలంగా మారింది.

అల్లకొండ ఖిల్లా పరిరక్షణ సమితి కార్యనిర్వహక అధ్యక్షుడు బి.ఆర్. నర్సింగ్ రావు, ఈ విషయం గురించి ముఖ్య మంత్రికి ఇచ్చిన వినతి పత్రంలో, ప్రయాణికులు జాతీయ రహదారిపై గంటల తరబడి బస్సుల కోసం వేచిచూసే పరిస్థితిని వివరిస్తూ. అదిలాబాద్, నిర్మల్, హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు ప్రయాణికులను రహదారిపైనే దింపి వెళ్ళిపోతున్నాయని, ఈ పరిస్థితులు వల్ల గర్భిణీ స్త్రీలు, వృద్ధులు వంటి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుపుతూ సీఎంఓ కార్యాలయంలో దరఖాస్తు అందచేసామని తెలిపారు.

ముఖ్యమంత్రి ఈ సమస్యను పరిష్కరించాలనీ, ఆర్టీసీ ఉన్నత అధికారులకు బస్టాండ్ మరమ్మత్తులు, సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని నర్సింగ్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యపై అధికారులు తక్షణమే ప్రత్యేక దృష్టి సారించి ప్రజల ప్రయాణ సౌకర్యం పెంచాలని కోరుతున్నారు.








