|| దృశ్యం న్యూస్ ||
బోధన్ పట్టణంలోని PRTU భవన్లో బుధవారం ప్రొఫెసర్ సాయిబాబా చిత్రపటానికి మానవ హక్కుల వేదిక, వామపక్ష పార్టీలు, మరియు ప్రజా సంఘాల నేతలు పూల దండ వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షుడు గడ్డం గంగులు మాట్లాడుతూ, ప్రొఫెసర్ సాయిబాబా పీడిత ప్రజల పక్షాన జీవితాంతం పోరాడిన ఘనతను గుర్తు చేశారు.
సాయిబాబా చేసిన పోరాటాలు పాలక వర్గాలకు అనుకూలంగా లేకపోవడంతో, అక్రమ ఆరోపణలతో 10 సంవత్సరాలు జైలులో ఉంచారని, 90 శాతం దివ్యాంగుడైన సాయిబాబా పట్ల కేంద్ర మరియు మహరాష్ట్ర ప్రభుత్వాలు క్రూరంగా వ్యవహరించాయని, ఆయనపై పెట్టిన అక్రమ కేసులను సుప్రీం కోర్టు కొట్టివేసిందని తెలిపారు.
ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించడం వల్ల మేథావులను మరియు హక్కుల కార్యకర్తలను వేధించడం దేశంలో సాధారణమైన పరిణామంగా మారిందని గంగులు పేర్కొన్నారు, సాయిబాబా జీవిత పాఠాలను తెలుసుకొని, ఆదివాసీ హక్కుల కోసం సంఘటిత పోరాటాలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు, ఆయనకు అర్పించే నిజమైన నివాళి, ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలపై నిలబడడం అని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి ఆపరేషన్ కగార్ చర్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, ఈ కార్యక్రమం ముగించారు.
ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు పి వరదయ్య, అహ్మద్, గౌతం కూమార్, గంగాధర్ అప్పా, గౌస్, సురేష్, మోసీం, పోశేట్టి, సాయికుమార్ లక్ష్మణ్ గౌడ్, నాగరాజు, ఖురేషీ, తదితరులు పాల్గొన్నారు.










