జానకంపేట్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి చరిత్ర
1. స్వామి ఉద్భవం మరియు స్థల మహత్యం:
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి అవతార కధలో, భక్త ప్రహ్లాదుడిని రక్షించేందుకు స్వామి ఉగ్రరూపంలో స్తంభాన్ని చీల్చి బయల్దేరాడు. హిరణ్యకశ్యపుడిని సంహరించిన అనంతరం, స్వామి ఉగ్రకోపంతో దండకారణ్యంలో సంచరిస్తూ జానకంపేట ప్రదేశంలో విశ్రాంతి తీసుకున్నాడు. ఈ స్థలం స్వామి యొక్క శాంతమైన రూపం వ్యక్తమైన క్షేత్రంగా మారింది.
ఋషులు స్వామి యొక్క ఉగ్రతను చూసి భయపడి, ఆయనను శాంతింపజేయాలని బ్రహ్మను ప్రార్థించారు. బ్రహ్మదేవుడి సూచన మేరకు గండకీ నది నుంచి తీసుకొచ్చిన సాలగ్రామాన్ని స్వామి నాభి వద్ద ఉంచగా, స్వామి స్వరూపం శాంతమయంగా మారింది.
2. ఆలయ నిర్మాణ విశేషాలు:

జైన సన్యాసులు స్వామి యొక్క పవిత్రతను గుర్తించి, జైన శైలిలో ఆలయాన్ని నిర్మించారు. ప్రధాన ద్వారంపై జైనుల ఆరాధ్య దేవత అయిన గజలక్ష్మి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. జానకంపేట నరసింహస్వామి ఆలయ ప్రాంతంను జైన మతబోధకుల ప్రధాన కేంద్రముగా మలచుకుని ఇక్కడి నుంచే వారు జైన ధర్మాన్ని ప్రచారం చేశారు.
3. శ్రీ రామలింగేశ్వర ఆలయ చరిత్ర:

రావణాసురుడిని సంహరించిన అనంతరం బ్రాహ్మ హత్య పాపం నుండి విముక్తి పొందేందుకు శ్రీరాముడు తనతో పాటు యుద్ధంలో పాల్గొన్న వారిని దేశమంతటా శివలింగాలను ప్రతిష్టించాలని ఆజ్ఞాపించెను. ఈ క్రమంలోనే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ సమీపంలో శ్రీ రామలింగేశ్వరుడిని ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి. అనంతరం కాకతీయులు అద్భుతమైన శిల్పకళతో ఈ ఆలయాలను అభివృద్ధి చేసి, శివ-కేశవ అన్యోన్యతను ప్రదర్శించారు.
4. అష్టముఖి కోనేరు విశిష్టత:
కలియుగం ఆరంభ సమయంలో కలి ప్రభావం వల్ల తపస్సు చేసుకునే ఋషులకు ఆటంకాలు అవాంతరాలు ఏర్పడతాయని భావించి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారిని వేడుకుని అష్టదిక్పాలకులను ఆవాహన చేసి వారి మధ్య కోనేరు (పుష్కరిణి) ను స్థాపించి ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా తపస్సు చేసేవారని పురాణాలు చెబుతాయి. ఆ క్రమంలో ఈ పుష్కరిణిలో భక్తితో స్నానం ఆచరించే మానవులపై కలి ప్రభావం తగ్గుతుందని, నవగ్రహ దోషాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యంగా శనివారం, అమావాస్య లేదా అష్టమి నాడు వేల సంఖ్యలో భక్తులు ఈ పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుంటారు.
5. ఆలయ ప్రత్యేకతలు:

- స్తంభాలపై పులి, ఏనుగు ప్రతిమలు: ఇవి స్నేహపూరిత భావాన్ని సూచిస్తాయి, శత్రువులు సైతం స్నేహితులుగా మారాలని ఈ శిల్పాలు ఉద్దేశ్యం.
- సాలగ్రామం: స్వామి నాభి వద్ద ఉన్న సాలగ్రామం వేదల ప్రకారం, గండకీ నదిలో లభిస్తుంది. ఈ సాలగ్రామ శిలను విష్ణు మూర్తి కలియుగ అవతార స్వరూపంగా భావిస్తారు.
- విష్ణు దశావతారాలు: ఆలయ గర్భగుడి వెలుపల ఈ రూపాలు దర్శనమిస్తాయి.
- పాదముద్రల ఆకారపు కొండలు: ఈ ఆలయ చుట్టూ ప్రాంతంలోని కొండలు నరసింహుడి పాదముద్రలుగా ఉంటాయని భక్తులు భావిస్తారు.
- స్వయంభు ఆంజనేయ విగ్రహాలు: ఆలయ చుట్టుప్రక్కల అటవీ ప్రాంతంలో మరియు గ్రామాలలో స్వామి వారి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి ప్రతిరూపాలు అనేకం దర్శనమిస్తాయి.
6. బ్రహ్మోత్సవాలు మరియు ఉత్సవాలు:

- ప్రతి సంవత్సరం మాఘ శుద్ధ అష్టమి నుండి ప్రతిపద వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
- ప్రతి మాసం స్వాతి నక్షత్రం నాడు స్వామి కళ్యాణం ఘనంగా జరుగుతుంది.
7. ఆలయానికి చేరుకునే మార్గం:
జానకంపేటకు రైలు లేదా రోడ్డు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. నిజామాబాద్ పట్టణం నుంచి బోధన్ లేదా బాసర వెళ్లే మార్గంలో, జానకంపేటకు 12 కి.మీ ప్రయాణించాలి. గ్రామం నుండి 1.5 కి.మీ దూరంలో ఆలయం ఉంది.
ధార్మిక శ్లోకం:
శ్రీమన్నృసింహ విభవే గరుడధ్వజాయ
తాపత్రయోపశమనాయ భవౌషధాయ
తృష్ణాది వృశ్చిక జలాగ్ని భుజంగ రోగ
క్లేశ వ్యయాయ హరయే గురవే నమస్తే.ఈ జానకంపేట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తుల ఆధ్యాత్మిక శాంతికి, ధార్మిక పరిరక్షణకు కేంద్రబిందువుగా నిలుస్తోంది.









