|| దృశ్యం న్యూస్ ||
సాలూరా, నిజామాబాద్ జిల్లా:
సాలూరా మండలంలోని హుంస, తగ్గెల్లి గ్రామాల పరిధిలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. ఇసుక దోపిడీకి సంబంధించిన ఫిర్యాదులు, ప్రజల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తహసీల్దార్ నవాజ్ ప్రత్యేక నిఘా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇసుక నిల్వ కేంద్రాలు, రవాణా మార్గాలు, నది పరివాహక ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ బృందాలను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నామని వెల్లడించారు.

ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలించడం, నిల్వ చేయడం లేదా విక్రయించడం చట్టవిరుద్ధమని తహసీల్దార్ స్పష్టం చేస్తూ, అక్రమ రవాణాకు పాల్పడే వ్యక్తులు, వాహన యజమానులు, మధ్యవర్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలిగిస్తున్న ఇటువంటి అక్రమ కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. అక్రమ ఇసుక రవాణాపై సమాచారం ఉన్న ప్రజలు అధికారులకు తెలియజేసి సహకరించాలని కోరారు.
అధికారుల పాత్రపైనా అనుమానాలు.. మాఫియాకే కాదు.. అధికారులపై నిఘాకు డిమాండ్.
అయితే, స్థానిక ప్రజలు మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా వ్యవహారంలో కేవలం మాఫియా వర్గాలే కాకుండా సంబంధిత శాఖల కొందరు అధికారుల పాత్రపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
స్థానికుల ఆరోపణల ప్రకారం, కొందరు అధికారులు అక్రమార్కులకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సహకరిస్తున్నారనే విమర్శలు చేస్తూ, విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధనల అమలులో లోపాలు, అక్రమ రవాణాదారులతో కుమ్మక్కు, అవినీతికి అవకాశం కల్పించడం వంటి కారణాల వల్లే ఇసుక దందా నిరాటంకంగా కొనసాగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిస్తూ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు అధికారులు అక్రమ కార్యకలాపాలకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై మాత్రమే కాకుండా సంబంధిత అధికారుల వ్యవహారశైలిపైనా సమగ్ర నిఘా ఉంచి, అవసరమైతే శాఖాపరమైన విచారణతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.








