|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన నమూనా పార్లమెంట్ (మాక్ పార్లమెంట్) కార్యక్రమంలో ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామానికి చెందిన కిశోర బాలిక ఉప్పు రసజ్ఞ విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో మంత్రిగా తన పాత్రను సమర్థంగా నిర్వహించిన రసజ్ఞ, అనంతరం రాష్ట్ర స్థాయి కార్యక్రమానికి ఎంపికైంది.
రాష్ట్ర స్థాయి నమూనా పార్లమెంటులో ప్రధానమంత్రి పాత్రను పోషించిన రసజ్ఞ తన వాక్చాతుర్యం, నాయకత్వ నైపుణ్యాలు, సామాజిక అంశాలపై అవగాహనతో అందరి ప్రశంసలు అందుకుంది. రసజ్ఞ ప్రదర్శనను అధికారులు, ఉపాధ్యాయులు, బాలికా సంఘాల అధికార ప్రతినిధులు అభినందించారు. రసజ్ఞ సాధించిన ఈ విజయం జానకంపేట్ గ్రామంతో పాటు నిజామాబాద్ జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.
కిశోర బాలికల సంఘాలు, స్నేహ బాలికా సంఘాలు నిర్వహించే ఇటువంటి కార్యక్రమాలు బాలికల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య అవగాహన, హక్కుల పరిరక్షణ భావనను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అలాగే బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, మహిళల భద్రత, సామాజిక మాధ్యమాల ప్రభావం వంటి అంశాలపై చర్చలు నిర్వహించడం ద్వారా బాలికల్లో ఆత్మవిశ్వాసం, సామాజిక చైతన్యం పెరుగుతోంది.
తెలంగాణ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు భవిష్యత్ మహిళా నాయకులను తీర్చిదిద్దే వేదికలుగా నిలుస్తున్నాయి.








