నాణ్యమైన విద్యకు హబ్ గా ఉన్న పట్టణం – ప్రస్తుతం గబ్బుగా మారుతున్న వైనం.

|| దృశ్యం న్యూస్ ||

నాణ్యమైన విద్యకు కేంద్రంగా ఉన్న పట్టణంలో విద్యా నిబంధనల అమలుపై ఆందోళన.

బోధన్‌లో ప్రైవేట్ పాఠశాలల తిరుపై అనేక ప్రశ్నలు..?

బోధన్, నిజామాబాద్ జిల్లా:
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనే నాణ్యమైన విద్యకు కేంద్రంగా పేరుగాంచిన బోధన్ పట్టణంలో ప్రైవేట్ పాఠశాలల నిర్వహణ, అనుమతులు, విద్యార్థుల భద్రత అంశాలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా విద్యా రంగంలో అభివృద్ధి చెందుతున్న బోధన్‌లో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి.

అనుమతులకు మించి తరగతుల నిర్వహణ – పాఠశాలల కేంద్రాల ఏర్పాటు.

బోధన్ పట్టణంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పొందిన అనుమతులకు మించి పాఠశాలల కేంద్రాలను ఏర్పాటు చేశాయని, కొన్ని పాఠశాలలో అదనపు తరగతులను నిర్వహిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం, తరగతి గదుల ప్రమాణాలు, క్రీడా మైదానాలు, భద్రతా సౌకర్యాలు వంటి అంశాల్లో కూడా నిబంధనల అమలుపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సమాచార హక్కు చట్టం కింద వివరాలకూ స్పష్టత కరువు.

కొంతమంది ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు మరియు పౌరులు ప్రైవేట్ పాఠశాలల అనుమతులు, గుర్తింపు వివరాలు, నిబంధనల అమలు స్థితిగతులపై సమాచార హక్కు చట్టం (RTI) ద్వారా పాఠశాల నిర్వాహకులకు, విద్యాశాఖ అధికారులకు వివరాలు కోరినప్పటికీ స్పష్టమైన సమాచారం అందడం లేదని ఆరోపిస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారులు అయితే పాత కోర్టు తీర్పులను ప్రస్తావిస్తూ సరైన సమాచారమే ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పౌరులు కోరిన సమాచారం వెల్లడించడంలో అధికారులు వెనుకంజ వెయ్యడంపై, ప్రైవేట్ పాఠశాలల పట్ల అధికారుల వైఖరిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. విద్యా ప్రమాణాల అమలు విషయంలో
పర్యవేక్షణ లోపిస్తున్నదా?
లేదా అవినీతికి పాల్పడుతున్నారా?
లేదా యాజమాన్యంతో ఆత్మీయ బంధం ఏదైనా ఏర్పడిందా?,
అంటూ అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పాఠశాలల నిర్వహణకు తప్పనిసరి అనుమతులు ఎన్నో?

నిబంధనల ప్రకారం ఒక ప్రైవేట్ పాఠశాల నిర్వహణకు సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు ఎన్నో పొందాలి. అందులో ముఖ్యంగా:
👉 మున్సిపల్ లేదా గ్రామపంచాయతీ అనుమతి
👉 భవన నిర్మాణ అనుమతి
👉 అగ్నిమాపక శాఖ అనుమతి
👉 ఆరోగ్య శాఖ అనుమతులు
👉 విద్యాశాఖ గుర్తింపు
👉 RTE (విద్యా హక్కు చట్టం) ప్రమాణాల అమలు
👉 విద్యార్థులకు తగిన తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం
👉 క్రీడా మైదానం మరియు భద్రతా ఏర్పాట్లు.
ఈ ప్రమాణాలు పాటించకుండా పాఠశాలలు నిర్వహించబడితే విద్యార్థుల భద్రత, విద్యా నాణ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటు, పైన తెలిపిన అనుమతులు లేకుండా లేదా సంబంధిత శాఖల గుర్తింపు పొందకుండా పాఠశాలలు నడిపితే విద్యాశాఖ గుర్తింపు రద్దు, జరిమానాలు, పాఠశాల మూసివేత వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ సమస్యలు ఎన్నో కనపడిన సంబంధిత అధికారులు చర్యలు చేపట్టిన దాఖలాలే లేవు.

విద్యార్థుల భవిష్యత్తు కోసం కఠిన చర్యలు ఎంతగానో అవసరం!

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యాశాఖ ఉన్నత అధికారులతో పాటు జిల్లా పరిపాలన యంత్రాంగం కూడా ప్రత్యేక కార్యాచరణ చేపట్టి ప్రైవేట్ పాఠశాలల అనుమతులు, భద్రతా ప్రమాణాలు, విద్యా నాణ్యతపై సమగ్ర పరిశీలన తనిఖీలు చేపట్టి, విద్యార్థులు తమ భవ్యమైన భవిష్యత్తు దిశగా అడుగులు వేసేలా నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై, అధికారుల నిర్లక్ష్య తీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు, విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment