|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో నిర్వహించిన అధికారిక సర్పంచ్‌ల సమావేశం తీవ్ర వివాదానికి దారితీసింది. ఎన్నికైన మహిళా సర్పంచ్‌ల స్థానంలో వారి భర్తలు సమావేశానికి హాజరైన ఘటన పరిపాలనా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత ఉన్న మండల అధికారుల సమక్షంలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గంభీరమైన వైఫల్యంగా పరిగణించబడుతోంది.
గ్రామ పంచాయతీ వ్యవస్థలో మహిళా సాధికారతను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ, ప్రాక్టికల్ స్థాయిలో ‘ప్రాక్సీ పాలన’ కొనసాగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పంచాయతీ రాజ్ యాక్ట్, 2018 ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధులే అధికారిక సమావేశాలకు హాజరై నిర్ణయాలు తీసుకోవాలి. వారి స్థానంలో ఇతరులు పాల్గొనడం స్పష్టమైన చట్టవిరుద్ధ చర్య అయినప్పటికీ సంబంధిత అధికారులు ఈ అంశాన్ని పట్టించుకోకుండా సమావేశం నిర్వహించడం పరిపాలనా నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది.

ఎడపల్లి మండలంలో ఎనిమిది మంది మహిళా సర్పంచ్‌లు ఉన్నప్పటికీ, వారిలో ఏ ఒక్కరు కూడా సమావేశానికి హాజరు కాకపోవడం గమనించాల్సిన విషయం, ‘Sarpanch Samvad’ ఈ-మొబైల్ అప్లికేషన్‌పై అవగాహన మండల సమావేశంలో పదవీలో ఉన్న సర్పంచ్‌లకే అధికారిక గుర్తింపు ఉండగా, సమావేశ హాజరు నమోదు ఎలా జరిగిందనే అంశం, అధికారులు ఎలా నిర్వహించారు అని స్పష్టత కోరుతోంది.
మండల ప్రజా పరిషత్ అధికారి, మండల పంచాయతీ అధికారి సమక్షంలో ఈ ఘటన జరగడం చట్టపరంగా మరియు నైతికంగా ప్రశ్నించబడుతోంది. మహిళా ప్రజాప్రతినిధుల స్వతంత్ర అధికారాన్ని కాపాడటం ప్రభుత్వ యంత్రాంగపు ప్రాథమిక బాధ్యత. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుని, సంబంధిత అధికారులకు హెచ్చరికలు జారీ చేయాలని ప్రజాప్రతినిధులు, సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.








