|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో ఉన్న బాలికల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలి వ్యవహారం తీవ్ర వివాదానికి దారి తీసింది. ఇంగ్లీష్ బోధించే ఉపాధ్యాయురాలు పి.రజని విద్యార్థినుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ, అసభ్య పదజాలం ఉపయోగించడం, శారీరకంగా-మానసికంగా వేధింపులకు గురిచేయడం వంటి ఆరోపణలతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థినులు సుమారు 10 రోజుల క్రితం గురుకుల పాఠశాల ఆవరణలో ధర్నాకు దిగారు.

ఉపాధ్యాయురాలిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేయగా, విద్యార్థి సంఘాల నాయకులు కూడా సంఘీభావం తెలిపారు. తల్లిదండ్రులు మద్దతు ఇవ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఈ ఘటనపై అధికారుల విచారణ కొనసాగుతున్న క్రమంలో, ఈ రోజు ఉపాధ్యాయురాలు పి.రజని ఎడపల్లి బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. తన రాజీనామా లేఖలో “I resign the job, accept my resignation” అని పేర్కొనడం గమనార్హం. ఈ ఘటన గురుకులాల్లో క్రమశిక్షణ, విద్యార్థినుల భద్రతపై చర్చకు దారి తీసింది.








