|| దృశ్యం న్యూస్ ||
మెదక్ : స్థానిక సంస్థల జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సూచించారు. గురువారం జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఆదేశాల మేరకు మెదక్, హవేలీఘనపూర్ ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ, అభ్యర్థులు నామినేషన్ దాఖలు సమయంలో ఊరేగింపులు నిర్వహించాలనుకుంటే ముందుగా పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరి అని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వాహనాలకు లౌడ్ స్పీకర్లు వినియోగించాలంటే సంబంధిత అధికారుల అనుమతి అవసరమని తెలిపారు.
అదేవిధంగా వాహనాలపై రిటర్నింగ్ అధికారి పర్మిట్ ఒరిజినల్ కాపీతో పాటు వాహనం నంబర్, అభ్యర్థి పేరు స్పష్టంగా విండ్స్‌క్రీన్‌పై ప్రదర్శించాలన్నారు. అలాగే, నామినేషన్ కేంద్రంలో మొబైల్ ఫోన్లు నిషేధించబడ్డాయని తెలిపారు. అభ్యర్థి అనుచరులు రిటర్నింగ్ అధికారి కార్యాలయం నుండి 100 మీటర్ల పరిధి వరకు మాత్రమే అనుమతించబడతారని స్పష్టం చేశారు.








