|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కేంద్రంలో శనివారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే యం.పద్మ దేవేందర్ రెడ్డి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాలలు అర్పించారు.

పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యజించిన అరుదైన త్యాగధనుడని కొనియాడారు. నిజాం నిరంకుశ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, దేశ స్వాతంత్ర ఉద్యమం కోసం, అలాగే తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పోరాటం చిరస్మరణీయమని అన్నారు.
బీసీల హక్కుల కోసం నిరంతరం పోరాడిన బాపూజీ చూపిన దారిలోనే తాము ముందుకు సాగుతామని తెలిపారు. ఆయన ఆశయాలు ఈ తరం నాయకులకు మార్గదర్శకమని, తెలంగాణ అభివృద్ధి కోసం ఆలోచనలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, పద్మశాలి సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.








