|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం పోక్సో కేసుల సమన్వయం, వేగవంతమైన న్యాయప్రక్రియ, నివారణ చర్యలపై కన్వర్జెన్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోక్సో కేసులను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. చిన్న వయసులో జరిగే వేధింపులు, ప్రేమ వ్యవహారాలు, పారిపోవడం వంటి సంఘటనలు బాలల భవిష్యత్తును దెబ్బతీస్తాయని హెచ్చరించారు. అవగాహన ద్వారానే ఇలాంటి కేసులను నివారించవచ్చని చెప్పారు.

భరోసా సెంటర్ 24/7 ఎలాంటి ఆటంకం లేకుండా సేవలందిస్తోందని ఎస్పీ ప్రశంసించారు. భరోసా సేవలను కళాబృందాల ద్వారా ప్రతి గ్రామానికి చేరవేయాలని ఆదేశించారు. భరోసా బృందం సవాళ్లు పంచుకోగా, వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి & గౌరవ న్యాయమూర్తి శుభావళి, అదనపు ఎస్పీ ఎస్. మహేందర్, డీఎస్పీ, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఏసీపీ శ్రీధర్, ప్రోగ్రామ్ మేనేజర్ శ్రీమతి రెంజీ, భరోసా బృందం, సంక్షేమ, వైద్య, విద్య శాఖ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి పాల్గొన్నారు.








