|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొల్చారం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రక్త పరీక్షల గది, ఇన్‌పేషెంట్ వార్డ్, టాయిలెట్స్, మందులు పంపిణీ గది, వాక్సినేషన్ రూమ్‌లను పరిశీలించారు. ఆసుపత్రికి రోజూ వచ్చే రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

మందుల స్టోర్ రూమ్‌లో స్టాక్ రికార్డులు, గడువు తేదీలను చెక్ చేసి, ఏ ఔషధం కూడా ఎక్స్పైరీ కాకుండా చూడాలని ఆదేశించారు. ఆసుపత్రి పరిసరాలను మరింత శుభ్రంగా ఉంచాలని, స్క్రాప్‌ను వెంటనే తొలగించాలని మెడికల్ ఆఫీసర్‌కు సూచించారు.

ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు పూర్తిస్థాయిలో అందిస్తేనే ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని కలెక్టర్ అన్నారు. రోగులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించి, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వైద్య సిబ్బందికి సూచించారు.
కలెక్టర్‌తో పాటు మెడికల్ ఆఫీసర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








