|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ సంస్కృతి ప్రతీకగా బోనాల పండుగను ఘనంగా జరిపిన హొవార్డ్ విద్యాసంస్థ. నిజామాబాద్ పట్టణంలోని న్యాల్కల్ రోడ్, రోటరీ నగర్లోని హొవార్డ్ పాఠశాలలో బోనాల వేడుకలు అత్యంత ఉత్సాహంగా, సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రిన్సిపల్ టీ.ఎస్ రత్నతేజ సమన్వయంగా నిర్వహించారు.

ప్రిన్సిపల్ డాక్టర్ టి.ఎస్. శశికళ మాట్లాడుతూ, బోనాలు తెలంగాణలోని ప్రముఖ ప్రజా ఆదరణ పండుగగా నిలిచిందని, ఇది మన సాంస్కృతిక వారసత్వానికి అద్దం పడుతుందని తెలిపారు. విద్యాసంస్థల కరస్పాండెంట్ టివీఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు పండుగల ప్రాముఖ్యతను వివరించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులను (మాతృమూర్తులను) ప్రత్యేకంగా ఆహ్వానించడం, భజంత్రీల మేళంతో బోనాలను తీసుకొని స్థానిక పీఎఫ్ ఆఫీస్ వద్ద కొలువై ఉన్న పోచమ్మ, మైసమ్మ దేవాలయం వద్ద బోనం సమర్పించి, ప్రతి మాతృమూర్తికి, పసుపు బొట్టు అలంకారం
చేసి సంప్రదాయ వాతావరణంలో పండుగ నిర్వహణ చేసుకున్నారు.
ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి ఉపాధ్యాయుల శ్రమ మరియు తల్లిదండ్రుల సహకారం కీలకం అని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న తల్లిదండ్రులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల తరపున విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.








