|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ (ఎంపిడిఓ) మరియు తహశీల్ధార్ కార్యాలయాల్లో ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. తనిఖీ సమయంలో ఎమ్మార్వో, ఎంపిడిఓలు విధుల్లో గైర్హాజరుగా ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానిక ప్రజలు మరియు రైతుల నుండి ఎంపీడీవో, ఎమ్మార్వో, సర్వేయర్ లపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ తనిఖీ చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సేవలు సమర్థవంతంగా అందుతున్నాయో లేదో తెలుసుకునే ఉద్దేశంతో అధికారులతో చర్చించారు. గైర్హాజరు అయిన అధికారులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు నివేదించినట్లు సమాచారం.
ఎమ్మెల్యే సూచనల మేరకు, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సేవలు సమయానికి అందించాలని, కార్యాలయ సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని స్పష్టం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై త్వరలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఎమ్మెల్యే తనిఖీలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ, అధికారులు సమయ పాలన పాటించడం లేదని, ప్రభుత్వ సేవల పరంగా ప్రజలకు, రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.








