|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా వైద్య సేవల్లో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి, కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు 24 గంటలూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నామని కలెక్టర్ తెలిపారు.

తనిఖీ సందర్భంగా ఆసుపత్రులలోని అత్యవసర చికిత్స విభాగం, ఇన్పేషెంట్ వార్డ్, ఔషధ నిల్వలు, డ్రగ్ స్టోర్ తదితర విభాగాలను పరిశీలించారు. మెదక్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ రాత్రి వేళల్లో కూడా అత్యుత్తమ సేవలు అందిస్తున్నదని సిబ్బంది క్రమశిక్షణతో విధులను నిర్వహిస్తున్నారని ప్రశంసించారు.
నర్సాపూర్ ఆసుపత్రిలో తనిఖీ చేస్తున్న సమయంలో 108 వాహనంలో పురిటి నొప్పులతో వచ్చిన ఆవంచ గ్రామానికి చెందిన మహిళకు వైద్య సిబ్బంది తక్షణమే స్పందించి సాధారణ ప్రసవం జరిపారు. తల్లి, బిడ్డలు సురక్షితంగా ఉండటం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు.

కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించినప్పుడు కూడా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం చూసి అభినందించారు. మెదక్ జిల్లా వైద్య సేవల్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచేందుకు అన్ని విభాగాలు కృషి చేస్తున్నాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.








