|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లాలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, శనివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల గురుకుల కళాశాల మరియు పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని పరిశీలించారు.
కలెక్టర్ రాహుల్ రాజ్ పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా గమనించి, విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నపత్రాల పంపిణీ నిబంధనల ప్రకారం జరుగుతుందా? ప్రశ్నపత్రాలు కేంద్రానికి నిర్ణీత సమయంలో చేరాయా? పోలీస్ ఎస్కార్ట్ సమయానికి ఉన్నారా? వంటి అంశాలను సమీక్షించారు.

అదనంగా, తాగునీటి వసతి, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పరీక్షా కేంద్రాల్లో కాపీయింగ్‌కు ఎలాంటి అవకాశం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అలాగే, పరీక్షా ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు చోటుచేసుకోకుండా పకడ్బందీగా నిర్వహించాల్సిందిగా సూచనలు అందించారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల కళాశాల ప్రిన్సిపల్ స్వర్ణలత, చీఫ్ సూపరింటెండెంట్ తదితర అధికారులు పాల్గొన్నారు.








