|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ యూనివర్సిటీ మెయిన్, సౌత్ మరియు బిఈడి క్యాంపస్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత (పీ.డీ.ఎస్.యు.) ఆధ్వర్యంలో తే.యూ. ఉపకులపతి ప్రొఫెసర్ యాదగిరిరావుకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా, పీ.డీ.ఎస్.యు. జిల్లా అధ్యక్షుడు ఎం.నరేందర్ మరియు ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ,
తెలంగాణ విశ్వవిద్యాలయం అనేక సమస్యలతో కష్టాల్లో ఉన్నట్లు వారు తెలిపారు, యూనివర్సిటీలో అకాడమిక్ వాతావరణం దిగజారిందని కొద్దిమంది వ్యక్తులు స్వప్రయోజనాల కోసం యూనివర్సిటీ మరియు విద్యార్థుల ప్రయోజనాలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని అన్నారు. అనేక వివాదాలకు కేంద్రంగా మారిన తెలంగాణ యూనివర్సిటీ ప్రక్షాళన అవసరమని అభిప్రాయపడారు,

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరించాలని, అలాగే ప్రహరీ గోడ నిర్మించి, 576 ఎకరాల యూనివర్సిటీ భూమిని కాపాడాలని కోరారు. అక్రమ నియామకాలపై చర్యలు తీసుకోవాలని, ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని పీ.డీ.ఎస్.యు. నేతలు పేర్కొన్నారు.
అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ కోర్సులుగా మార్చాలని, సౌత్ క్యాంపస్లో అన్ని వసతులతో కూడిన లైబ్రరీ ఏర్పాటు చేయాలని, పీజీ మరియు పీహెచ్.డి. విద్యార్థులకు ఫెలోషిప్ సౌకర్యం కల్పించాలనే అభ్యర్థన చేశారు.
ఈ కార్యక్రమంలో పీ.డీ.ఎస్.యు. జిల్లా ఉపాధ్యక్షులు ఎల్.అనిల్ కుమార్, అషూర్, కోశాధికారి నిఖిల్ మరియు ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు. యూనివర్సిటీకి మంచి గుర్తింపు తెచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.










