ప్రాణాలు తీస్తున్న రహదారులపై వడ్ల కుప్పలు.. ప్రమాదంలో మహిళ మృతి, అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలో రహదారులపై ఆరబెట్టిన వడ్ల కుప్పలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. పెగడపల్లి గ్రామ సమీపంలో రహదారిపై ఆరబెట్టిన వడ్ల కుప్పను ఢీకొని మూడు రోజుల క్రితం తీవ్రంగా గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందడం కలకలం రేపింది. ఈ ఘటనతో స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
రాత్రి వేళల్లో రహదారులపై వడ్ల కుప్పలు స్పష్టంగా కనిపించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు పంటను ఆరబెట్టేందుకు సరైన వేదికలు లేకపోవడంతో రహదారులనే వడ్ల ఆరబోత ఆశ్రయంగా వినియోగిస్తున్నారని పేర్కొంటున్నారు.

అయితే ఈ పరిస్థితిపై సంబంధిత అధికారులు కేవలం హెచ్చరికలు జారీ చేయడానికే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో శాశ్వత పరిష్కారాలపై దృష్టి సారించడం లేదని సామాజిక వర్గాల నాయకులు మండిపడుతున్నారు.
రైతులకు వడ్లు ఆరబెట్టుకునే ప్రత్యేక స్థలాలు, డ్రైయింగ్ యార్డులు, తాత్కాలిక వేదికలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా, రహదారులపై ధాన్యం ఆరబెట్టడం వల్ల కలిగే ప్రమాదాలపై రైతులకు తగిన అవగాహన కల్పించడంలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామాల్లో సురక్షిత ధాన్యం ఆరబెట్టే సదుపాయాలు కల్పించడంతో పాటు, వెంటనే వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి అని ప్రజలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు మరిన్ని అమాయక ప్రాణాలను బలితీసుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment