మెదక్: చేగుంటలో జూదంపై టాస్క్ ఫోర్స్ దాడులు – 7 మంది అరెస్ట్, భారీ నగదు స్వాధీనం.

|| దృశ్యం న్యూస్ ||

మెదక్ జిల్లా చేగుంట మండలం రామంతాపూర్ అటవీ ప్రాంతంలో బొమ్మా బోరుసు (జూదం) నిర్వహిస్తున్న వారిపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి 7 మందిని అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

విశ్వసనీయ సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రామంతాపూర్ అటవీ ప్రాంతంలో జూదం ఆడుతున్న గుంపుపై దాడి చేశారు. ఈ చర్యలో నేరెళ్ల రాజు, మల్గా ప్రభాకర్, ఎలగందుల నర్సింలు, సాయిగౌడ్, కాబోజి ప్రవీణ్, వనం రాజు, ఉప్పాల నరేష్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.24,070 నగదు మరియు 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇక చిట్టోజిపల్లి స్వామి, పోతులగూడ నరేష్ స్వామి, వల్లూరు రాజు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిని చేగుంట పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు మాట్లాడుతూ, జిల్లాలో చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేకాట, బెట్టింగ్ వంటి అక్రమ చర్యల వల్ల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని, ముఖ్యంగా యువత ఇలాంటి దారుణాలకు దూరంగా ఉండాలని సూచించారు. అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే ప్రజలు పోలీసులకు తెలియజేయాలని కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment