బోధన్: దుర్గంధంతో గ్రామస్థులకు నరకం – అధికారుల మౌనంతో కొనసాగుతున్న అక్రమ పౌల్ట్రీ.

|| దృశ్యం న్యూస్ ||

భరించలేని కోళ్ల పెట్ట దుర్గంధం – ఉక్కిరిబిక్కిరి అవుతున్న గ్రామ జీవనం:

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పరిధిలోని బోధన్–బాసర ప్రధాన రహదారి సమీపంలోని పెగడపల్లి గ్రామ శివారులో ప్రభుత్వ అనుమతులు లేకుండానే భారీ స్థాయిలో కోళ్ల పెంపకం కేంద్రం నిర్బంధం లేకుండా కొనసాగుతుండటం తీవ్ర కలకలం రేపుతోంది. శాలిమార్ హేచరీస్ లిమిటెడ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సంస్థ తొమ్మిది భారీ గిడ్డంగులు నిర్మించి వేల సంఖ్యలో కోళ్లను పెంచుతూ లక్షల్లో వ్యాపారం సాగిస్తున్నా, సంబంధిత శాఖల అధికారులు మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది.
ఏ అనుమతుల్లేని కోళ్ల పెంపకం కేంద్రం కారణంగా పెగడపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన దుర్గంధ వాతావరణం నెలకొంది. రోజంతా విరుచుకుపడే దుర్వాసనతో గ్రామ ప్రజలు ఊపిరి తీసుకోవడానికే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు వాంతులు, జ్వరాలు, శ్వాసకోశ సమస్యలు, చర్మవ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఈ కేంద్రంపై వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

నోటీసులు లెక్కచెయ్యని నిర్వాహకులు – అధికారుల మౌనం ఎందుకు?

గ్రామ ప్రజల ఫిర్యాదులను గుర్తించిన గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇప్పటికే నోటీసులు జారీ చేసినప్పటికీ, కంపెనీ నిర్వాహకులు వాటిని లెక్కచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి, గ్రామ పంచాయతీ అనుమతి, భవన నిర్మాణ అనుమతి, పౌల్ట్రీ ఫారం స్థాపన అనుమతి, పశుసంవర్ధక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఫైర్ సేఫ్టీ, కార్మిక శాఖల అనుమతులు లేకుండానే ఈ కోళ్ల పెంపకం కేంద్రం కార్యకలాపాలు కొనసాగుతుండటం చట్టాలపై బహిరంగ అవహేళనగా మారింది.
నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాలకు కనీసం ఒక కిలోమీటర్ దూరంలోనే కోళ్ల పెంపకం కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కానీ ఈ కేంద్రం గ్రామానికి అతి సమీపంలో ఉండటమే కాకుండా పక్కనే ఉన్న చెరువులోకి వ్యర్థాలు వదులుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వల్ల నీటి వనరులు కలుషితమయ్యే ప్రమాదం ఏర్పడింది. అలాగే ప్రధాన రహదారి పక్కనే ఉండటంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పరిసర వ్యవసాయ పొలాల రైతులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

అనుమతుల్లేకుండా భారీ పౌల్ట్రీ కార్యకలాపాలు – చట్టాలపై బహిరంగ అవహేళన:

ఇన్ని అక్రమాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం వెనుక అధికారుల అండదండలు, ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉందనే అనుమానాలు గ్రామంలో చర్చనీయాంశంగా మారాయి. గతంలో కొన్ని అనుమతులతో నిర్వహించిన ఈ కోళ్ల పెంపకం కేంద్రం రెండు సంవత్సరాల క్రితం మరో కంపెనీకి చేతులు మారినప్పటికీ, పాత అనుమతుల కాగితాలను చూపిస్తూ ప్రస్తుత సంస్థ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చట్టాలను చుట్టాల మాదిరిగా మలుచుకుంటున్న ఇలాంటి సంస్థలకు గుణపాఠం చెప్పాలని, జిల్లా ఉన్నతాధికారులు ఇకనైనా స్పందించి ఈ అనుమతుల్లేని కోళ్ల పెంపకం కేంద్రంపై కఠిన చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, అవినీతికి తావులేకుండా న్యాయం చేయాలని పెగడపల్లి గ్రామస్థులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment