|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో చోటు చేసుకున్న మందుగుండు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. దుపల్లి గ్రామానికి చెందిన కారె సాయికుమార్‌కు చెందిన ఆవు పేలుడు మందు కారణంగా మృతి చెందింది. గుర్తుతెలియని వ్యక్తులు అడవి పందుల వేట కోసం పేలుడు మందును పశు ఆహార పదార్థమైన తవుడులో ముద్దగా పెట్టి వదిలినట్లు తెలుస్తోంది. మేతకు వెళ్లిన ఆవు ఆ ఆహారాన్ని తినగానే నోట్లో ఒక్కసారిగా పేలుడు సంభవించి తీవ్ర గాయాలపాలై మృతి చెందింది.

గురువారం జరిగిన ఈ ఘటన పండగ సమయానికి జరగడంతో ఆవును పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గ్రామ శివారుల్లో అక్రమంగా పేలుడు మందు వినియోగించడం పశువుల ప్రాణాలకు కాక ప్రజల భద్రతకు కూడా పెద్ద ప్రమాదంగా మారుతుందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై పోలీస్ శాఖ సమగ్ర విచారణ చేపట్టి, అక్రమ వేటకు పాల్పడిన బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నిఘా అవసరమని వారు సూచిస్తున్నారు.








