బోధన్: అతివేగం – అక్రమ ఇసుక రవాణాతో మృత్యు కాండ: అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు శాపంగా మారింది.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో అక్రమ ఇసుక రవాణా రోజురోజుకు హద్దులు దాటుతోంది. ఈ అక్రమాలపై కఠిన చట్టాలున్నా వాటి అమలు శూన్యం. అధికారులు ఉన్నా చర్యలు లేవు. ఫలితంగా అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి.

వేకువజాము మొదలుకొని రాత్రి చీకటి పడే వరకు పదుల సంఖ్యలో ట్రాలీ ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా రెవెన్యూ, పోలీస్, రవాణా శాఖలు మౌన వీక్షకులుగా మారాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
మంగళవారం సాలూరు మండలం సాలురా క్యాంపు శివారులో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఈ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది. హున్సా గ్రామానికి చెందిన ముద్ద రాజు ద్విచక్ర వాహనంపై బోధన్ వైపు వెళ్తుండగా, ఇసుకను ఖాళీ చేసి తిరిగి అతివేగంగా వస్తున్న ట్రాలీ ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్‌కు సమాచారం అందించి బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో నిజామాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఇది ఒంటరి ఘటన కాదు. ఇటీవలే బోధన్ మండలం కల్దుర్కి వద్ద ట్రాక్టర్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన మరవకముందే మరో ప్రాణాంతక ప్రమాదం జరగడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. అక్రమ ఇసుక రవాణా, అతివేగం, వాహనాలకు సరైన ధ్రువపత్రాలు లేకపోవడం, మైనర్లు వాహనాలు నడపడం వంటి తీవ్రమైన నేరాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.


చట్టాలు కాగితాలకే పరిమితమై, క్షేత్రస్థాయిలో అమలు లేకపోవడం వల్లే ఈ దుర్ఘటనలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతూ అక్రమ ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఇకనైనా సంబంధిత శాఖలు మేల్కొని అక్రమ ఇసుక రవాణాపై శాశ్వత పరిష్కారానికి ఉక్కుపాదం మోపాలని, రహదారులపై నిరంతర తనిఖీలు చేపట్టాలని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే మరిన్ని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని, అధికారులపై ప్రజాగ్రహం ఉద్ధృతమయ్యే పరిస్థితి తప్పదని ప్రముఖులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment